వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఉమర్ జలీల్‌ను సస్పెండ్ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ జరిగాయి. వికారాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, వికారాబాద్ ఎన్నిక చెల్లదని ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఓ వైపు ప్రసాద్ కుమార్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం ఈవీఎంలను పరిశీలిస్తున్న క్రమంలో కలెక్టర్ ఉమర్ జలీల్.. అన్ని ఈవీఎంలతో పాటు వికారాబాద్ అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను కూడా తెరిచారు. హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండగా, ఆ ఈవీఎంలను తెరవడం చట్టప్రకారం తప్పు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈ ఘటనపై విచారణ జరిపించారు. ఓ కమిటీ వికారాబాద్ వెళ్లి ఆ రోజు జరిగిన వివరాలను సేకరించింది. అయితే, హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉందన్న విషయం తనకు తెలియదని, అందుకే వాటిని తెరిచానంటూ కలెక్టర్ వివరణ ఇచ్చారు. అయితే, ఆ వాదనతో కమిటీ ఏకీభవించలేదు. హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉందన్న విషయాన్ని తాము తెలియజేశామని, కలెక్టర్ ఆ విషయం తెలియదని చెప్పడం బాధ్యతారాహిత్యంగా భావించి, ఉమర్ జలీల్‌ను సస్పెండ్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇవి కూడా చదవండి
మోదీ వస్తే భయమెందుకు?: టీడీపీకి బీజేపీ ప్రశ్న
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.