దుబ్బాక ఉప ఎన్నికలకు కౌంట్ డౌన్ కొద్దిసేపట్లో మొదలవనుండగా.. తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, ప్రముఖ సినీనటి విజయశాంతి సంచలన ఆరోపణలు చేశారు. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలవగానే.. హరీశ్ రావుకు కేసీఆర్ బంపర్ గిఫ్ట్ ఇవ్వనున్నట్టు ఆమె ఆరోపించారు. ఇందుకు తాజాగా సీఎం చేస్తున్న సవాళ్లే సాక్ష్యాలని ఆమె అన్నారు. కొడుకు కేటీఆర్ ను సీఎం చేయడానికి కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారని.. అందుకు దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ముహుర్తం పెట్టారని ఆమె తెలిపారు. నమ్మిన వారి గొంతు కోయడంలో ఆయనను మించినవారులేరని ఆమె ఫైరయ్యారు. ఈ మేరకు ఫేస్బుక్ లో విజయశాంతి సంచలన ఆరోపణలు గుప్పించారు.
విజయశాంతి ఫేస్బుక్ లో షేర్ చేసిన పోస్టు యథావిధిగా... ‘‘దుబ్బాక ఉప ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు రాకుండా తీవ్రంగా కృషి చేస్తున్న తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఊహించని షాక్ ఇవ్వనున్నట్టు చర్చ జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక తరువాత, జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఈ ఫలితాలు వచ్చిన వెంటనే.. టీఆర్ఎస్ లోని పలు గ్రూపులు తన కుమారుడు కేటీఆర్ ను సీఎంగా కూర్చోబెట్టడానికి ఒత్తిడి తెచ్చే విధంగా కేసీఆర్ రంగాన్ని సిద్ధం చేస్తున్నారనే వాదన వినపడుతున్నది. ఈ వాదనను మరింత బలోపేతం చేయడానికి ... తొలిసారిగా సీఎం తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. (ఇటీవల కొడగొండ్లలో జరిగిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.) అయితే తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ అన్న మాటలు.. భవిష్యత్తు సంకేతాలేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ప్రస్తుత కేంద్ర హోంమంత్రి, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గతంలో తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. అప్పుడు దీనిపై స్పందించిన కేసీఆర్ కాస్త మెతక వైఖరి ప్రదర్శించారు. ఈ ఆరోపణలను రుజువు చేయకుంటే.. అమిత్ షాను తెలంగాణ భూభాగం లోకి అడుగు పెట్టనీయబోమని ఆయన హెచ్చరించడాన్ని ఎవరూ మర్చిపోలేరు. మరి తదుపరి ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.
అంతే కాదు, తనపై, తన ప్రభుత్వం అనవసరమైన ఆరోపణలు చేస్తే ప్రతిపక్ష నాయకులను జైలుకు పంపిస్తామని కూడా కేసీఆర్ బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. తన ప్రభుత్వంపై ఆరోపణలు చేసినప్పుడు ప్రతిపక్షం మీద ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్.. ఇప్పుడు సీఎం పదవికి రాజీనామా చేస్తాననడం ఆసక్తికరంగా మారింది.
ఒకవైపు హరీశ్ రావు దుబ్బాకలో అంతా తానై వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులపై ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. మరోవైపు కేసీఆర్ బీజేపీ నాయకులకు సవాళ్లు విసురుతూ వారిని రెచ్చగొడుతున్నారు. ఈ సవాళ్లు బీజేపీ నాయకులకు మాత్రమే కాదు .. పరోక్షంగా కూడా హరీష్ రావుకు కూడా ఇస్తున్నారని తెలంగాణ సమాజం భావిస్తోంది.
మొత్తంగా కేసీఆర్ రాజీనామా ప్రకటన చూస్తే .. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలవగానే (ఒకవేళ గెలిస్తే)హరీశ్ కు మామ కేసీఆర్ బంపర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. ఆ బహుమతి ఏమిటంటే .. సీఎం పదవికి రాజీనామా చేసి కేటీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టనున్నాడనే వాదన బలంగా వినిపిస్తుంది. నమ్మిన వారి గొంతు నొక్కడంలో కేసిఆర్ శైలి భిన్నంగా ఉంటుంది..’’ అంటూ విజయశాంతి ముగించారు. విజయశాంతి పోస్టుతో పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా ఏకీభవిస్తుండటం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Dubbaka By Elections 2020, Facebook, Harish Rao, KTR, Social Media, Telangana, Telangana News, Vijayashanti