కేసీఆర్ పాలన ఎలా ఉందంటే... విజయశాంతి సెటైర్లు..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై తెలంగాణ కాంగ్రెస్  ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి విమర్శలు గుప్పించారు.

news18-telugu
Updated: July 12, 2020, 2:28 PM IST
కేసీఆర్ పాలన ఎలా ఉందంటే... విజయశాంతి సెటైర్లు..
విజయశాంతి (Vijayashanti)
  • Share this:
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై తెలంగాణ కాంగ్రెస్  ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి విమర్శలు గుప్పించారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్య సిబ్బంది సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. ‘తెలంగాణలో కేసీఆర్ దొరగారి పాలన ఎంత అరాచకంగా ఉందో తాజా పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్య సిబ్బంది ఎన్ని అవమానాల పాలవుతున్నారో ఔట్‌సోర్సింగ్ నర్సుల ఆందోళన చూస్తే తెలుస్తుంది. పోస్టింగులు, సీనియారిటీ, జీతాల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ రోడ్డెక్కిన నర్సులకు జవాబు చెప్పలేక సర్కారు నీళ్ళు నములుతోంది. ఇక ఆర్టీసీ సిబ్బందికి అందిన జూన్ నెల జీతాల్లోనూ ఆందోళన నెలకొంది. దారుణమైన కోతలతో ఆర్టీసీ సిబ్బందికి ఇచ్చిన జీతం డబ్బులతో ఏ విధంగా బతుకీడ్చాలో తెలియక వారు కుమిలిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సీఎం  ఎప్పుడు ఫాంహౌస్‌లో ఉంటారో... ఎప్పుడు ప్రగతిభవన్‌లో దర్శనమిస్తారో తెలియని దుస్థితి నెలకొంది. ఇదేనా మీరు చెప్పిన బంగారు తెలంగాణ? ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది? సీఎం దొరగారు జవాబు చెప్పాలి.’ అంటూ ఓ ప్రకటనలో విజయశాంతి ప్రశ్నించారు.

తెలంగాణలో కరోనా వైరస్ సోకిన వైద్య కుటుంబ సంక్షేమ శాఖ సిబ్బందికి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తాజాగా నిమ్స్ డైరెక్టర్‌కు లేఖ రాసింది. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎంతో మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు మహమ్మారి బారిన పడుతున్నారని తెలిపింది. అలా కరోనా బారిన పడిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఉద్యోగులకు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించాల్సిందిగా ఆ లేఖలో కోరింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పేరుతో లేఖ విడుదల చేశారు.

ఇటీవల కరోనా లక్షణాలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రి డీఎంఓ డాక్టర్ సుల్తాన్ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం ఒక్క రోజులోనే రూ. 1.50 లక్షలు బిల్లు వేసిందని ఆమె ఆరోపించారు. ఈ విషయమై ప్రశ్నిస్తే తనను నిర్భంధించారని ఆరోపించారు. ఫీవర్ ఆసుపత్రి డీఎంఓ డాక్టర్ సుల్తానాను నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. డాక్టర్ సుల్తానా చేసిన ఆరోపణలపై విచారణ నిర్వహించి బాధ్యులుగా తేలితే చర్యలు తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు.

తెలంగాణలో నిన్న 1178 కరోనా వైరస్ కేసులు నిర్ధారణ అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 33,402కి పెరిగింది. నిన్న 9 మంది కరోనా కారణంగా చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 348గా ఉంది. నిన్న జీహెచ్ఎంసీలో అత్యధికంగా 736 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డి (125), మేడ్చల్ (101), సంగారెడ్డి (13), వరంగల్ అర్బన్ (20; కరీంనగర్ (24), పెద్దపల్లి (12), మెదక్ (16), మహబూబ్ నగర్ (12), నల్లగొండ (12), రాజన్న సిరిసిల్ల జిల్లా (24), నిజామాబాద్ (12) కరోనా కేసులు నమోదయ్యాయి. మరికొన్ని జిల్లాల్లో 10 కంటే తక్కువ సంఖ్యలో కేసులు నిర్ధారణ అయినట్టు ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ బులెటిన్‌లో తెలిపింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 12, 2020, 2:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading