Kalyana Lakshmi: కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై విజిలెన్స్ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి..

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలలో అవినీతి, అక్రమాలు జరిగే ఆస్కారమే లేదంటూ ఓ వైపు ప్రభుత్వ పెద్దలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. క్షేత్ర స్థాయిలో నిజాలు మాత్రం వెక్కిరిస్తున్నాయి.

 • Share this:
  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలలో అవినీతి, అక్రమాలు జరిగే ఆస్కారమే లేదంటూ ఓ వైపు ప్రభుత్వ పెద్దలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. క్షేత్ర స్థాయిలో నిజాలు మాత్రం వెక్కిరిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల వ్యయంతో వేలాది మందికి అందాల్సిన ఈ పథకాలలో అక్రమాలను నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం ఆ మధ్య విజిలెన్స్‌ విచారణ చేపట్టింది. ఈ విచారణలో దిమ్మ తిరిగే నిజాలు వెలుగుచూశాయి.

  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో అక్రమాలు, అవకతవకలు నిజమేనని నిర్ధారణ అయింది. ఆరోపణలను నిగ్గుతేల్చేందుకు రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేయగా అవకతవకలు నిజమేనని తేలింది. అనర్హులకు డబ్బులు చెల్లించి వారి వద్ద నుంచి లంచాలు తీసుకున్నట్లు గుర్తించారు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల్లో అనర్హులకు నగదు చెల్లించిన తహశీల్దార్లు,ఆర్ఐలు, విఆర్ఏలు 43 మంది అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ నివేదికలో వెల్లడైంది.

  ఇది కూడా చదవండి: Nizamabad: ‍‍కుటుంబ అవ‌స‌రాల కోసం న‌ర్సుగా మారిన స‌ర్పంచ్.. ఉద‌యం స‌ర్పంచ్‌గా... మ‌ధ్యాహ్నం ఎఎన్ఎంగా విధులు

  క్షేత్ర స్థాయిలో లీడర్లు, వారి అనుచరులు, మీసేవ కేంద్రాల నిర్వాహకులు, తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, మరికొందరు బ్రోకర్లు కలసి అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో నిగ్గుతేలింది. రాష్ట్రంలో 10 జిల్లాలకు చెందిన 43 మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది పేదలను ఏ విధంగా దోచుకున్నది విజిలెన్స్ విభాగం తన నివేదికలో స్పష్టంగా వివరించింది. విచారణలో బయటపడ్డ అక్రమాల్లో మచ్చుకు కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి.

  ఆదిలాబాద్ ఆర్డీవో ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం దరఖాస్తుల ప్రక్రియలో రూ.86.09 లక్షల మొత్తం దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గుడి హత్నూర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 148/2020 కింద నిందితునిపై ఐపీసీ 420, 403, 409 సెక్షన్ల కింద అలాగే ఐటీ యాక్ట్ 66 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

  వరంగల్ అర్బన్ (ప్రస్తుత హనుమకొండ) జిల్లాలో ధర్మసాగర్ తహశీల్దార్ ఆఫీసు కేంద్రంగా అవినీతి జరిగింది. ఇక్కడి తహశీల్దార్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా భారీ ఎత్తున లంచాలు స్వీకరించినట్లు విజిలెన్స్ నివేదిక పేర్కొంది. ఇందుకోసం తహశీల్దార్ కొందరు ప్రజా ప్రతినిధులను, ఇతరులను బ్రోకర్లుగా నియమించుకుని వసూళ్లకు పాల్పడినట్లు నివేదికలో స్పష్టంగా ఉంది. తహశీల్దార్ లంచాల బాగోతపు వసూళ్లలో మాజీ ఎంపీపీ, సర్పంచ్ల ప్రమేయమున్నట్లు విజిలెన్స్ నిర్ధారించింది.

  ఇది కూడా చదవండి: Siddipet: ‘మేం చచ్చిపోతాం నాయనా.. ఇక మా వల్ల కాదు’ అంటున్న సర్పంచులు

  ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన మొత్తం 43 మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్దిదారుల దరఖాస్తు ప్రక్రియలో లంచాల రూపంలో వసూళ్లకు పాల్పడినట్లు విజిలెన్స్ నివేదిక వివరించింది. దరఖాస్తుదారుల నుంచి రూ. వెయ్యి నుంచి పది వేల వరకు వసూళ్లు చేసినట్లు కూడా విజిలెన్స్ నివేదిక ప్రస్తావించింది. లంచాల రూపంలో అక్రమ వసూళ్లకు కొందరు అధికారులు పాల్పడ్డారు.

  అక్రమాలకు పాల్పడిన 43 మంది రెవెన్యూ సిబ్బందిలో తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, వీఆర్వోలు, వీఆర్ ఏలతోపాటు మరికొందరి స్థానికుల ప్రమేయం ఉన్నట్లు విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదించింది. అయితే వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ తహశీల్దార్‌గా విజిలెన్స్ జాబితాలో తొలి పేరుగా ప్రస్తావించిన ఎం.రాజ్ కుమార్ ఎవరనే అంశంపై రెవెన్యూ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది.

  ఇది కూడా చదవండి: Huzurabad ఉప ఎన్నిక ఫలితం ఇదేనా! -డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా?

  వాస్తవానికి ఈ పేరుతో తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం అమలు చేస్తున్న కాలం నుంచి, అంటే గడచిన ఏడేళ్ల కాలంలో రాజ్ కుమార్ అనే పేరుగల అధికారి ఎవరూ ఇక్కడ తహశీల్దార్ గా పనిచేసిన దాఖలాలు లేవు. గత కొంత కాలంగా సీహెచ్ రాజు అనే అధికారి మాత్రమే ఇక్కడ తహశీల్దార్‌గా పనిచేస్తున్నారు. ఈ పథకం కోసం దరఖాస్తు సమర్పణ సమయంలోనే ధర్మసాగర్ తహశీల్దార్ రాజ్ కుమార్ లంచాలు స్వీకరించినట్లు విజిలెన్స్ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు.

  దీంతో వీరందరిపైనా శాఖా పరమైన విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. వీరికి అండగా నిలిచినట్టు నివేదికలో పేర్కొన్న మాజీ ఎంపీపీలు, సర్పంచులు, ఇంకా ఎంపీటీసీలు ఇతర చోటామోటా లీడర్ల పైనా క్రిమినల్‌ కేసులు పెట్టాలన్న యోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ తెచ్చిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని చెబుతున్నారు.

  జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్‌, న్యూస్‌ 18 తెలుగు, ఖమ్మం జిల్లా

  Published by:Sambasiva Reddy
  First published: