తెలుగు మీడియంలో విద్యాబోధన ద్వారా మాత్రమే వికాసం...ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

వరంగల్ పర్యటనలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

మాతృభాషను జన్మభూమిని మరచిపోవద్దు. మాతృభాషలోనే ప్రాథమక విద్యాభ్యాసం జరగాలి. పరిపాలనా భాషగా మాతృభాష ఉండాలని వెంకయ్యనాయుడు అన్నారు.

  • Share this:
    ఆంధ్ర విద్యావర్ధిని (ఏవీవీ) విద్యాసంస్థల ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు, మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ..వరంగల్‌ అంటే ఎంతో ప్రేమ, అనుబంధం ఉంది. విద్య, సాహిత్య, సాంస్కృతిక కేంద్రమైన వరంగల్‌కు రావడం ఆనందంగా ఉందని అన్నారు. కాకతీయులు నిర్మించిన చెరువులను కాపాడుకోవాలి. చెరువులు ఆక్రమణలకు గురికాకుండా చూడాలని తెలిపారు. మాతృభాషను జన్మభూమిని మరచిపోవద్దు. మాతృభాషలోనే ప్రాథమక విద్యాభ్యాసం జరగాలి. పరిపాలనా భాషగా మాతృభాష ఉండాలని వెంకయ్యనాయుడు అన్నారు. అంతేకాదు మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు గారు తనను ఉన్నత విద్యావంతుడిని తీర్చిదిద్దడంలో హన్మకొండ లోని మల్టీపర్పస్ ఉన్నత పాఠశాల, సుబేదారిలోని విశ్వవిద్యాలయ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల వేసిన పునాదిని చివరి వరకు గుర్తుంచుకున్నారంటే, విద్యారంగంలో వరంగల్ నగరం పోషించిన పాత్రను అర్ధం చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే వరంగల్‌లో 75 ఏళ్ల క్రితం తెలుగుభాషాభివృద్ధి, విద్యావ్యాప్తి లక్ష్యంగా ప్రారంభమైన ఆంధ్ర విద్యాభివర్ధిని విద్యాసంస్థలు 75 ఏళ్లు పూర్తి చేసుకోవడం.. ఈ సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగస్వాములవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. నిజాం ఏలుబడిలో ఉర్దూ భాషలోనే విద్యాభ్యాసం ఉండాలని కఠినమైన ఆదేశాలున్న నేపథ్యంలోనూ.. నిజాం నవాబును ఒప్పించి, మెప్పించి.. మన అస్తిత్వానికి ప్రతీక అయిన మాతృభాష తెలుగులో విద్యాబోధన జరిగేలా చొరవతీసుకున్న చందా కాంతయ్య కృషికి ఫలితమే ఈ విద్యాలయమని గుర్తు చేశారు. అలాగే 1945లో ప్రారంభమైన ఆంధ్రవిద్యాభివర్థిని ఉన్నతపాఠశాల ఆ తర్వాత ఏవీవీ జూనియర్ కళాశాల, ఏవీవీ డిగ్రీ, పీజీ కళాశాలుగా విస్తరించి.. 75 ఏళ్లుగా ఓరుగల్లు కేంద్రంగా చేస్తున్న విద్యాసేవకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.

    తెలుగు మాధ్యమంలో విద్యాబోధన ద్వారా మాత్రమే వికాసం సాధ్యమవుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అందుకే నేను మొదట్నుంచీ మాతృభాషలోనే విద్యావిధానం కొనసాగాలని చెబుతూ వస్తున్నాను. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో కనీసం ప్రాథమిక, సెకండరీ విద్యవరకైనా తెలుగులో కొనసాగితే.. విద్యార్థులు విషయ పరిజ్ఞానం పెంచుకునేందుకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. భాష, భావనలను వేర్వేరుగా చూడలేము. అందుకే సరైన, స్పష్టమైన భావ వ్యక్తీకరణకు భాషే మూలమని.. మన అమ్మభాషకు మనం దూరం అవుతున్నామంటూ కవి కాళోజీ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాన్ని మనం గుర్తుచేసుకోవాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
    Published by:Krishna Adithya
    First published: