వకీల్ సాబ్ చిత్రం ప్రదర్శిస్తున్న ఓ థియేటర్‌లో కొందరు యువకులు హల్‌చల్ చేశారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. 50 మంది యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన తెలంగాణ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శాంతి థియేటర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. శాంతి థియేటర్‌లో వకీల్ సాబ్ చిత్ర ప్రదర్శన జరుగుతోంది. శుక్రవారం సెకండ్ షో సమయంలో కొందరు యువకులు మద్యం తాగి థియేటర్‌లోని వచ్చారు. ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. సుమారు 50 మంది థియేటర్‌లో భయానక వాతావరణం సృష్టించారు. రెండు గ్రూపులుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. సినిమా తెరపై వాటర్ బాటిళ్లతో దాడి చేశారు. అలాగే థియేటర్‌లోని సీట్లను చింపివేశారు. దీంతో పలువురు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. దాదాపు అరగంట పాటు ఈ గొడవ కొనసాగింది.
దీంతో అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యం.. వకీల్‌సాబ్ సినిమా ప్రదర్శనను నిలిపివేసింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి.. యువకులను సముదాయించారు. అయితే ఈ ఘటన ఇప్పుడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య గొడవ జరిగినట్టుగా పట్టణంలో ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ ఘటనతో శాంతి థియేటర్ స్క్రీన్‌తోపాటు కొంత భాగం ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. మరి ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
ఇక, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. నిన్న ఉదయం బెనిఫిట్ షో నుంచే థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అయితే కొన్ని చోట్ల చిత్ర ప్రదర్శిన కొంత ఆలస్యం కావడంతో.. పవన్ అభిమానులు థియేటర్లలో వీరంగం సృష్టించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kamareddy, Telangana, Vakeel Saab