హోమ్ /వార్తలు /తెలంగాణ /

టీవీ 9లో చేరిన V6 ‘బిత్తిరి సత్తి’ రవి..

టీవీ 9లో చేరిన V6 ‘బిత్తిరి సత్తి’ రవి..

రజినీకాంత్, రవి

రజినీకాంత్, రవి

‘బిత్తిరి సత్తి’గా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న రవి టీవీ9లో చేరాడు.

‘బిత్తిరి సత్తి’గా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న రవి టీవీ9లో చేరాడు. గతంలో వీ6 ఛానల్‌లో టాప్ రేటింగ్ సంపాదించుకున్న ‘తీన్మార్’ ప్రోగ్రామ్‌లో కనిపించాడు. అతడి హావభావాలు, ప్రవర్తనతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లాడు. ఈ క్రమంలో వీ6 బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. బిత్తిరిసత్తికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బీభత్సంగా పెరిగింది. అయితే, అదే ప్రోగ్రామ్‌లో యాంకర్‌ సావిత్రక్కగా పనిచేసిన శివజ్యోతి కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్‌ తెలుగు సీజన్ 3లో కంటెస్టెంట్గా వెళ్లింది. ఇప్పుడు ‘బిత్తిరి సత్తి’ రవి కూడా ఛానల్ మారాడు. టీవీ9లో రజనీకాంత్ వద్ద అపాయింట్‌మెంట్ లెటర్‌ను తీసుకుంటున్న ఫొటో బయటకు వచ్చింది. తీన్మార్ వార్తలతో పాటు పలు సినిమాలు, టీవీ కామెడీ షోలు, ప్రైవేట్ ప్రోగ్రామ్స్‌లో కూడా బిత్తిరిసత్తి అప్పుడప్పుడు కనిపించేవాడు.

తెలంగాణ యాసతో, తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేస్తూ వీ6 న్యూస్ ప్రజల్లోకి బలంగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఆఫ్ బీట్ వార్తలకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. టీఆర్పీ రేటింగ్స్ కూడా బాగా వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఛానల్స్ కూడా తీన్మార్ వార్తలను పోలిన ప్రోగ్రామ్స్‌ను సిద్ధం చేసుకున్నాయంటే అతిశయోక్తి కాదు. గతంలో టీవీ 9 కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. అయితే, అది తీవ్ర విమర్శల పాలైంది. తాజాగా, టీవీ9 కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లింది. దీంతో వారు మరోసారి అలాంటి ప్రోగ్రామ్‌ను తయారు చేయాలని సంకల్పించినట్టు కనిపిస్తోంది. భారీ మొత్తంలో జీతం ఆఫర్ చేసినట్టు సమాచారం. కొన్ని రోజుల నుంచి శివజ్యోతి, రవి లేకుండానే తీన్మార్ వార్తలు ప్రసారం అవుతున్నాయి. అయితే, మరి భవిష్యత్తులో కూడా అదే రేటింగ్‌ను సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. ఆశ్చర్యకరంగా వీ6 ఛానల్ అధినేత జి.వివేక్ వెంకటస్వామి కొన్ని రోజుల క్రితం బీజేపీలో చేరారు. టీవీ 9 యాజమాన్యానికి టీఆర్ఎస్ పార్టీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

First published:

Tags: TV9

ఉత్తమ కథలు