Telangana | అదే చెప్పుల క్యూ.. అదే ఎరువుల బాధ..

తెలంగాణ ప్రభుత్వం రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచుతామని చెప్పిన సీఎం కేసీఆర్ చేతల్లో మాత్రం చేయడం లేదని రైతులు మండిపడ్డారు.

news18-telugu
Updated: September 4, 2019, 8:07 PM IST
Telangana | అదే చెప్పుల క్యూ.. అదే ఎరువుల బాధ..
చెప్పులను లైన్లో పెట్టి నిలబడిన రైతులు, యూరియా కోసం క్యూలో ఉన్న మహిళలు
news18-telugu
Updated: September 4, 2019, 8:07 PM IST
తెలంగాణ ప్ర‌త్యేక‌ రాష్ట్రం ఏర్పడితే రైతులు ఎరువుల కోసం చెప్పులు లైన్ లో పెట్టే దుస్థితి ఉండ‌ద‌ని ఉద్య‌మ నేత‌గా ఉన్నప్పుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఆయన ఇప్పుడు ముఖ్య‌మంత్రి అయ్యారు. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్పడినా రైతుల ప‌రిస్థితి మాత్రం మార‌లేదు. అదే చెప్పుల‌ను క్యూ లైన్ పెట్టి ఎరువుల కోసం ఎదురుచూస్తున్నారు రైతులు. అధికారుల నిర్ల‌క్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా యురియా కొర‌త ఏర్పడింది. ఈ యేడు 45రోజులు ఆల‌స్యంగా వర్షాలు కురవడంతో రైతులు పంటల సాగు ఆల‌స్యంగా ప్రారంభించారు. కురుస్తున్న వ‌ర్షాల‌తో రైతులు వ్య‌వ‌సాయ అధికారుల అంచనాల‌కు మించి సాగుచేసారు. దీంతో ఎరువుల కొర‌త ఏర్పడింది. ఈ పాటికే రావాల్సిన ఎరువుల‌ను అధికారులు తెప్పించక పోవ‌డంతో ఎరువుల కొర‌త ఏర్పడింది. దీంతో ఎరువుల కోసం రైతులు బారులు తీరి రోజుల త‌ర‌బ‌డి ఎదురుచూస్తున్నారు. సొసైటీకి వ‌చ్చే ఒక‌టి రెండు లారీలు స‌రిపోక పోవ‌డంతో రైతులు ఆందోళ‌న చెందుతున్నారు..

పంట‌ల‌కు ఎరువులు వేసే స‌మ‌యంలో యూరియా లేక పోవ‌డంతో పంట దిగుబ‌డి త‌గ్గిపోతుంద‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.. జిల్లాలోని అన్ని మండలాల్లో ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. జ‌క్రాన్ ప‌ల్లి మండ‌లం ఆర్గుల్ గ్రామంలో ఉద‌యం నుంచి సొసైటీ కేంద్రం వద్ద క్యూలైన్లలో భారీ సంఖ్య‌లో నిలబడి ఉన్నారు. అయితే ఒక్క‌రికి ఒక్క‌ సంచి మాత్ర‌మే ఇస్తున్నామ‌ని అధికారులు చెప్పడంతో రైతులు అందోళన చెందుతున్నారు. ఉద‌యం నుంచి క్యూ లైన్లో నిల‌బడితే ఒక సంచి ఇస్తే రోజూ ఎరువుల కోసం తిరుగుతూనే ఉండాలా? అని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచుతామని చెప్పిన సీఎం కేసీఆర్ చేతల్లో మాత్రం చేయడం లేదని రైతులు మండిపడ్డారు. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని రైతులు ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రిస్తున్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి స్పందించి రైతులందరికీ సరిపడా ఎరువులను సరఫరా అయ్యేలా చూడాలని కోరుతున్నారు.

(పి.మ‌హేంద‌ర్, నిజామాబాద్, న్యూస్ 18 తెలుగు ప్ర‌తినిధి)



First published: September 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...