పెళ్లి కాని అమ్మాయిలే అతడి టార్గెట్.. అందమైన అబ్బాయిల ఫొటోలతో వల.. హైదరాబాద్ లో కొత్త మోసం వెలుగులోకి..!

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ కు చెందిన ఓ యువతికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ యువతి కూడా మ్యాట్రిమోనీ సైట్లలో అబ్బాయిల ప్రొఫైల్స్ ను చూడటం మొదలు పెట్టింది. గతేడాది అక్టోబర్ నెలలో ఓ యువకుడి ప్రొఫైల్ ఆమెకు తెగ నచ్చేసింది.

 • Share this:
  పెళ్లి పేరుతో ఎన్నారైలను మోసం చేస్తున్న హైదరాబాద్ కిలేడీ బాగోతం రెండ్రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మాయ మాటలు చెప్పి అధునాత టెక్నాలజీని వాడుకుని విదేశాల్లో ఉన్న ఎన్నారైలను టార్గెట్ గా చేసుకుని లక్షలకు లక్షలు కొల్లగొట్టిందా యువతి. చివరకు ఓ వ్యక్తి ఫిర్యాదుతో ఆమె బాగోతం బయటపడింది. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సారి బాధితులు అమ్మాయిలు కావడం గమనార్హం. మ్యాట్రిమోనీ సైట్లలో అందమైన కుర్రాళ్ల ఫొటోలను పెట్టి, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారంటూ నమ్మిస్తోందో ముఠా. వారి ప్రొఫైల్స్ కు ఫిదా అయిన యువతులను ఫోన్లలోనే మాటలు కలిపి నమ్మించి డబ్బును కొల్లగొడుతోంది. హైదరాబాద్ కు చెందిన ఓ యువతి మోసపోవడంతో ఈ ఘటన బయటపడింది.

  హైదరాబాద్ కు చెందిన ఓ యువతికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ యువతి కూడా మ్యాట్రిమోనీ సైట్లలో అబ్బాయిల ప్రొఫైల్స్ ను చూడటం మొదలు పెట్టింది. గతేడాది అక్టోబర్ నెలలో ఓ యువకుడి ప్రొఫైల్ ఆమెకు తెగ నచ్చేసింది. అందంతోపాటు మంచి కెరీర్ ఉండటంతో ఆ ప్రొఫైల్ లో ఉన్న నెంబర్ కు ఫోన్ చేసింది. ’నేను కెనడాలో ఉద్యోగం చేస్తున్నాను. వైద్యుడిగా ఇక్కడ నాకు మంచి కెరీర్ ఉంది. జీతం కూడా బాగానే వస్తుంది. భవిష్యత్తులో కూడా ఇక్కడే ఉంటాను. దానికి మీరు అంగీకరిస్తే పెళ్లి గురించి మాట్లాడుకుందాం‘ అని ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో ఆమె కూడా ఓకే చెప్పింది. వారిద్దరూ రోజూ ఫోన్లలో మాట్లాడుకునేవాళ్లు. ఈ క్రమంలోనే ఆ అమ్మాయి తల్లిదండ్రులతో కూడా అతడు మాట్లాడాడు. త్వరలోనే నిశ్చితార్థ వేడుక పెట్టుకుందామని అంతా అనుకున్నారు.
  ఇది కూడా చదవండి: హైదరాబాద్ టెకీకి షాకింగ్ అనుభవం.. క్రెడిట్ కార్డు ఫ్రీగా ఇస్తున్నాం సర్.. అంటూ షాపింగ్ మాల్ బయట ఓ వ్యక్తి చెప్పడంతో..

  అయితే కొద్ది రోజుల క్రితం ఆ యువతికి అతడు ఫోన్ చేసి ’నిశ్చితార్థ వేడుక ఘనంగా ఉండాలి. అందుకే నీకు రూ.కోటి విలువైన బంగారం, వజ్రాభరణాలు పంపిస్తున్నాను. అవి నిశ్చితార్థం రోజు నేను నీకు ఇచ్చే చిన్న కానుకగా భావించు‘ అని చెప్పాడు. దీంతో ఆ యువతి ఎగిరిగంతేసింది. కొద్ది రోజుల తర్వాత ’మేం ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఫోన్ చేస్తున్నాం. రూ.కోటి రూపాయల విలువైన బంగారం, వజ్రాలు ఉన్న బాక్స్ మీకు వచ్చింది. అయితే భారతీయ నిబంధనల ప్రకారం ఇంత మొత్తంలో విదేశాల నుంచి బంగారు ఆభరణాలు తీసుకు రాకూడదు. దీనికి రూ.10.69 లక్షల టాక్స్ చెల్లించాల్సి ఉంది. దాన్ని చెల్లిస్తే రెండ్రోజుల్లో మీకు డెలివరీ అవుతుంది‘ అని చెప్పాడు. దీంతో ఆ యువతి వాళ్లు చెప్పినట్టే డబ్బును చెల్లించింది. ఆ తర్వాత కొద్ది సేపటికే తనకు వచ్చిన ఫోన్ నెంబర్ కు తిరిగి ట్రై చేసింది.
  ఇది కూడా చదవండి: అయ్యో పాపం.. జీవితాంతం సంపాదించిన సొమ్మంతా ఒక్క ఫోన్ కాల్ తో మటాష్.. ఏకంగా రూ.77 లక్షలు..

  అయితే ఆ ఫోన్ స్విచాఫ్ అని వచ్చింది. దీంతో వెంటనే కెనడాలో తాను త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తికి ఫోన్ చేసింది. అతడి ఫోన్ కూడా స్విచాఫ్ వచ్చింది. పలుమార్లు ఫోన్ చేసినా ఇదే స్పందన ఉండటంతో ఆమె మోసపోయానని గ్రహించింది. దీంతో ఆ యువతి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదును తీసుకుని విచారణ చేసిన పోలీసులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ వాసి మహ్మద్ హసీన్ ను అరెస్ట్ చేశారు. అతడి ఆధ్వర్యంలో పనిచేసే ఓ ముఠా మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా అమ్మాయిలను మోసం చేస్తోందని పోలీసులు వెల్లడించారు. అందమైన యువకుల ఫొటోలను పెట్టి, వాటికి స్పందించిన యువతులను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
  ఇది కూడా చదవండి: హైదరాబాద్ లోని ఓ యువతిపై అమెరికా నుంచి తెలుగు టెకీ ఫిర్యాదు.. ఆమె గురించి ఆరా తీసిన పోలీసులకే..
  Published by:Hasaan Kandula
  First published: