• Home
 • »
 • News
 • »
 • telangana
 • »
 • UNION MINISTER KISHAN REDDY SLAMS CM KCR FOR HIS COMMENTS ON CENTRE AK

దుబ్బాకపై ప్రత్యేక వ్యూహం.. కేసీఆర్‌ కావాలనే చేస్తున్నారన్న కిషన్ రెడ్డి

కేసీఆర్, కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)

Kishan Reddy Comments on CM Kcr: తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలను సీఎం కేసీఆర్ కేంద్రానికి ముడిపెడుతూ విమర్శలు చేయడాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు.

 • Share this:
  టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీని గుర్తిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికను బీజేపీ ఎదుగుదలకు ఉపయోగించుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. మాజీమంత్రులు, ఎమ్మెల్యేలకు మండలాల బాధ్యతలను అప్పగిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేయబోయే తమ అభ్యర్థి పేరును త్వరలోనే ప్రకటిస్తామని ఆయన అన్నారు. ఈ అంశంపై పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో ప్రత్యేకంగా చర్చించారు.

  తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలను సీఎం కేసీఆర్ కేంద్రానికి ముడిపెడుతూ విమర్శలు చేయడాన్ని కిషన్ రెడ్డి తప్పుబట్టారు. ఏపీ సీఎం జగన్‌తో కలిసి కేసీఆర్ భోజనం చేయగాలేనిది... జల వివాదాలపై మాట్లాడటం చేతకాదా ? అని కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. గతంలో జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని సీఎం కేసీఆర్ కావాలనే వాయిదా వేయించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇద్దరు సీఎంలు కలిసి కూర్చుంటే మధ్యవర్తిత్వానికి కేంద్రం సిద్ధమని ఆయన అన్నారు. గతంలో మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు మాట్లాడుకుంటే కేంద్రం అడ్డుపడిందా ? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

  అంతకుముందు కృష్ణా - గోదావరీ నదీ జలాల వినియోగం విషయంలో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న తీరును, ఏడేండ్లుగా మౌనం వహిస్తున్న కేంద్రం వైఖరిని తప్పుపడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటాలకు సంబంధించి వివరాలను పొందుపరిచారు. అత్యున్నత స్థాయి పాలనా యంత్రాంగం, జల వనరులశాఖ నిపుణులు, అధికారులతో కూడిన బృందం 48గంటలపాటు శ్రమించి సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఈ ఉత్తరాన్ని రూపొందించింది. ఈ క్రమంలో అంతర్జాతీయ, జాతీయ, అంతర్ రాష్ట్ర జలన్యాయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, సహజ న్యాయంతో కూడిన ధర్మసూత్రాలను అనుసరించి 60 సంవత్సరాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాలను పునః పరిశీలించి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ఎత్తిపడుతూ కేంద్రానికి ఈ లేఖను ఎక్కుపెట్టారు.

  అంతర్ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం 1956 సెక్షన్-3 కింద తెలంగాణ ఫిర్యాదును ఏడేళ్లుగా ట్రిబ్యునల్ కు నివేదించకుండా కేంద్రం తాత్సారం చేయడాన్ని సీఎం కేసీఆర్ ఈ లేఖలో ఎత్తిచూపారు. కేంద్రం నిర్లక్ష్యం కారణంగా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను తెలంగాణ ఇప్పటిదాకా పొందలేకపోయిందని, రెండు రాష్ట్రాల మధ్య జల పంపిణీని సుగమం చేసే బదులు.. కేంద్రం వైఖరి వివాదాలకు ఆజ్యం పోసిందని కేసీఆర్ ఈ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ ఫిర్యాదును సెక్షన్-3 క్రింద నివేదించాలని ముఖ్యమంత్రి ఈ లేఖ ద్వారా కేంద్రాన్ని కోరారు.

  పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా జలాలను కృష్ణా బేసిన్ అవతల ఉన్న ప్రాంతాలకు పెద్దఎత్తున తరలించుకుపోతుంటే కృష్ణా నదీ జలాల యాజమాన్యబోర్డు (కేఆర్ఎంబీ) ఏం చేస్తున్నదని లేఖలో నిలదీశారు. పోతిరెడ్డిపాడును 80వేల క్యూసెక్కుల సామర్థ్యానికి విస్తరించడాన్ని, రోజుకు 3 టీఎంసీలు తరలించడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తీసుకుంటున్న చర్యలను కేఆర్ఎంబీ నిరోధించలేక పోవడాన్ని కేసీఆర్ ఈ లేఖలో ఎత్తిచూపారు. తక్షణమే పోతిరెడ్డిపాడు నుంచి అక్రమ నీటి తరలింపును ఆపడానికి కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో కోరారు. శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు అవసరమైన సాగునీటితోపాటు, హైదరాబాద్ నగరానికి తాగునీటి కోసం ఇబ్బందులు రాకుండా చూడాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.
  Published by:Kishore Akkaladevi
  First published: