Kishan Reddy: ఇదేం పద్ధతి.. జీహెచ్ఎంసీ అధికారులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్

Kishan Reddy: కేంద్రమంత్రి స్థాయిలో పర్యటిస్తుంటే జీహెచ్ఎంసీ అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

news18-telugu
Updated: October 15, 2020, 11:26 AM IST
Kishan Reddy: ఇదేం పద్ధతి.. జీహెచ్ఎంసీ అధికారులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
హైదరాబాద్‌లోని వరద బాధిత ప్రాంతాల్లో తన పర్యటన సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నగరంలో తన పర్యటన సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు ఎవరూ రాకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ లోకేష్ కుమార్‌కు ఫోన్ చేసి అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. నగరంలోని అనేక వరద బాధిత ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో రాత్రి సమయంలోనూ ఆయన పర్యటన కొనసాగింది. గురువారం ఉదయం ఖైరతాబాద్, బేగంపేట, బన్సీలాల్ పేట, రాంగోపాల్ పేట పర్యటన సందర్భంగా కిషన్ రెడ్డి దృష్టికి అనేక సమస్యలు వచ్చాయి.

దోమల గూడలోని అరవింద్‌, సూరజ్‌ కాలనీలో పర్యటించి బాదిత కుటుంబాలను పరామర్శించారు. అక్కడి పరిస్థితులు, ఇబ్బందుల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో భారీ వర్షలు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. ఖైరతాబాద్‌ ముంపు ప్రాంతాల్లో కేంద్రంమంత్రి కిషన్‌రెడ్డి పర్యటించారు. అక్కడి పరిస్థితులు, ఇబ్బందుల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతితో ఫోన్‌లో మాట్లాడారు. నిత్యావసరాలు,పాలు, ఆహారం పంపిణీ చేయాలని కలెక్టర్‌కు సూచించారు. కిషన్‌రెడ్డి ముందే బీహెచ్‌ఎంసీ అధికారులను స్థానికులు నిలదీశారు.

మరోవైపు కేంద్రమంత్రి స్థాయిలో పర్యటిస్తుంటే జీహెచ్ఎంసీ అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అధికారులు తన వెంటరాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌తోపాటు, జీహెచ్ఎంసీ అధికారులకు కూడా ఆయన ఫోన్ చేసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి హోదాలో పర్యటిస్తుంటే ఎవరూ పట్టించుకోకపోవడం సరికాదని తెలిపారు. భారీ వర్షాలకు హైదరాబాద్ పూర్తిగా డ్యామేజ్ అయిందని.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వరదలను అంచనా వేయటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించారు. చేతకాని మంత్రులు కేంద్రంపై నిందలు వేయటాన్ని ఖండిస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయటానికి సిద్ధంగా ఉందన్నారు. మరొక్క రోజు వర్షం పడితే హైదరాబాద్ పరిస్థితి ఏమయ్యేదో ఊహించుకోవటం కష్టంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: October 15, 2020, 11:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading