నిర్మల్ జిల్లా భైంసాలో ఆదివారం రాత్రి చెలరేగిన అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. సోమవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి ఫోన్ చేసిన అమిత్ షా.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. భైంసాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి అమిత్‌షాకు తెలియజేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇక, భైంసాలో నెలకొన్న పరిస్థితులపై మరోసారి తెలంగాణ డీజీపీతో మాట్లాడినట్టు కిషన్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉన్నట్టు డీజీపీ తెలిపారని అన్నారు. నేరస్థులను త్వరలోనే పట్టుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారని కూడా వెల్లడించారు. ఇక, అంతకు ముందు భైంసాలో జరిగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కిషన్‌రెడ్డి చెప్పారు. మీడియా సిబ్బందిపైన దాడి దురదృష్టకరమని.. అది తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు.
భైంసాలో ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఇరువర్గాలకు చెందిన వ్యక్తుల మధ్య చోటుచేసుకున్న గొడవ.. అల్లర్లకు దారితీసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగానే.. కొందరు వాహనాలు, దుకాణాలకు నిప్పంటించడంతో అవి దహనమయ్యాయి. ఇరువర్గాలు తలలు పగిలేలా రాళ్లతో దాడులు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో చిన్నారులు, మహిళలు, ఓ ఎస్సై, కానిస్టేబుల్‌తోపాటుగా ఇద్దరు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘర్షణల్లో గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడి పరిస్థితులను పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.
Hon’ble Home Minister Sri @AmitShah Ji called me to enquire about the Bhainsa(Telangana) incident & the prevailing situation.
Spoke to @TelanganaDGP yet again, during which he apprised me & assured that the situation is now under control & that the offenders will be nabbed soon.
భైంసాలో జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి-TUWJ
నిర్మల్ జిల్లా భైంసాలో మరో సారి ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణను కవర్ చేయడానికి వెళ్లిన ఇద్దరు జర్నలిస్టులపై అల్లరి మూకలు దాడిచేసి తీవ్రంగా గాయపర్చడాన్ని తెలంగాణ యూనియన్ ఆప్ వర్కింగ్ జర్నలిస్టు(TUWJ) నాయకులు తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులు వృత్తి ధర్మంలో భాగంగా ఎలాంటి సంఘటన జరిగినా అక్కడికి వెళతారని.. అలా వెళ్లిన వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. దీనిని TUWJ తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. దాడిలో గాయపడ్డ దేవా, విజయ్ అనే జర్నలిస్టులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇలాంటి ఘర్షణలకు పాల్పడుతున్న అల్లరి మూకలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని తెలంగాణ యూనియర్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం తరఫున డిమాండ్ చేశారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలి కోరుతున్నట్టు చెప్పారు. ఈ మేరకు TUWJ అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్, TEMJU అధ్యక్షుడు ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి ఎ. రమణ కుమార్, TUWJ హైదరాబాద్ అధ్యక్షుడు పి యోగానంద్, ప్రధాన కార్యదర్శి యార నవీన్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.