టెక్నాలజీ వాడకం జోరందుకున్న క్రమంలోనే సైబర్ నేరాలూ పెరుగుతుండటంతో కేసుల దర్యాప్తు పోలీసులకు సవాలుగా మారింది. అదే సమయంలో విదేశీ శక్తులు, ఉగ్రమూకలు సైతం సైబర్ ప్రపంచం నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో దానిపై నిఘా అనివార్యమైంది. సైబర్ నేరాలు-ఘోరాల కట్టడి చర్యల్లో భాగంగా కేంద్రం దేశవ్యాప్తంగా 7 ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీలను ఏర్పాటు చేయడం తెలిసిందే. తెలంగాణలోని హైదరాబాద్ లో ఉన్న సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం ప్రారంభించారు. (Amit Shah Hyderabad Visit)
హైదరాబాద్ రామంతపూర్ లోని సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్సిట్యూట్ కు కేంద్ర హోం మంత్రి మంత్రి అమిత్ షా విచ్చేశారు. ఇక్కడి ప్రాంగణంలో నూతంగానే ఏర్పాటు చేసిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ నూతన ల్యాబ్స్ ను ఆయన ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఫోరెన్సిక్ ల్యాబ్ ఓపెనింగ్ చేశారు. అనంతరం ల్యాబంతా కలియదిరిగారు.
ఈ సందర్భంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబులో పరికరాల పనితీరును సైంటిస్టులు.. అమిత్ షాకు వివరించారు. సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఈ ఎక్విప్ మెంట్ ఉపయోగపడనుందని సైంటిస్టులు ఆయనకు తెలిపారు. ఈ కార్యక్రమంలో షా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎన్సీఎఫ్ఎల్ సైంటిస్టులు ఉన్నారు.
ల్యాబ్ ప్రారంభోత్సవం తర్వాత అమిత్ షా శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ కు వెళ్లారు. అక్కడ తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ నేతలతో హోం మంత్రి భేటీ అయ్యారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితిని నేతలు వివరించగా.. వారికి షా దిశానిర్దేశం చేశారు. మరికాసేపట్లో అమిత్ షా తుక్కుగూడలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 8.20 తర్వాత కేంద్ర మంత్రి తిరిగి ఢిల్లీ వెళ్లిపోతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.