కేంద్ర బడ్జెట్‌పై కేసీఆర్ మార్క్ ఉంటుందనే ప్రచారం నిజమైంది. తెలంగాణలో విజయవంతంగా అమలవుతున్న రైతుబంధు పథకం తరహాలోనే దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు నగదు బదిలీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని గత ఏడాది డిసెంబర్ నుంచే అమలు చేయబోతున్నట్టు కేంద్ ప్రకటించింది. ఐదెకరాల లోపు ఉన్న రైతుల బ్యాంక్ అకౌంట్లోకి ఏడాదికి ఆరు వేల రూపాయలు జమ చేయనున్నట్టు బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మూడు విడతల్లో ఈ మొత్తానికి జమ చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం రూ. 75 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అన్నారు. ఈ పథకం ద్వారా దేశంలోని పది కోట్ల మంది రైతులకు లబ్ది కలుగుతుందని తెలిపారు.
మరోవైపు కేంద్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక అయిన రైతుబంధు పథకాన్ని అమలు చేయడంపై టీఆర్ఎస్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. కేంద్రం కూడా రైతుబంధు అమలు చేయాలని టీఆర్ఎస్ నేతలు గతంలోనే సూచించారు. ఫెడరల్ ఫ్రంట్ ఎజెండాలోనూ ఈ ప్రతిపాదన ఉందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మోడల్‌ను కేంద్రం అమలు చేసిందనే క్రెడిట్ తమకు దక్కుతుందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఈ అంశం తమకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. రైతు సంక్షేమంలో అంతా తమను ఫాలో కావాల్సిందే అని చెప్పుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం లభించింది.
“మా పథకాలు దేశానికే ఆదర్శం. ఈ విషయన్ని కేసీఆర్ పలు మార్లు పలు వేదికల మీద చెప్పారు. రాజకీయాల కోసం కాకుండా రైతులకు మేలు చేయాలని ఉద్దేశించిందే రేతుబంధు పథకం.” అని టీఆర్ఎస్ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి న్యూస్ 18తో అన్నారు.
తెలంగాణ స్ఫూర్తితో ఇప్పటికే పలు రాష్ట్రాలు రైతుబంధు తరహా పథకాలు అమలు చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లో ‘క్రిశక్ బంధు’ పేరుతో ఐదు వేల రూపాయలు రెండు విడతలుగా పెట్టుబడి సాయం కింద అందజేస్తున్నారు. జార్ఖండ్ సర్కారు ‘ముఖ్యమంత్రి క్రిషి ఆశీర్వాద్ యోజన’ కింద ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న వారికి ఐదు వేల రూపాయలు అందజేస్తోంది. బీహార్ ప్రభుత్వం ‘రాజ్య ఫసల్ సహాయతా యోజన’ పేరుతో పెట్టుబడి సాయం అందిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Pm modi, Telangana, Union Budget 2019