హైదరాబాద్ సీపీ ఎదుట లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు

అనారోగ్య కారణాలతో వారు లొంగిపోయినట్టు పోలీసులు తెలిపారు.

news18-telugu
Updated: October 9, 2018, 2:55 PM IST
హైదరాబాద్ సీపీ ఎదుట లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు
లొంగిపోయిన మావోయిస్టులు రవి, భారతక్క
  • Share this:
తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల కదలికల మీద పోలీసులు డేగకన్ను వేసిన వేళ.. ఇద్దరు మావోయిస్టులు స్వతంత్రంగా లొంగిపోయారు. నేరుగా హైదరాబాద్‌లోని పోలీస్ కమిషనరేట్‌కు వచ్చిన వారు సీపీ అంజనీకుమార్ ఎదుట సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిని పురుషోత్తం అలియాస్ రవి, వినోదిని అలియాస్ భారతక్కగా పోలీసులు ప్రకటించారు. వారిద్దరూ పలు కేసుల్లో నిందితులు. వీరిద్దరూ సికింద్రాబాద్ అడ్డగుట్ట బస్తీ పరిరక్షణ కోసం కృషి చేశారు. నాలుగు దశాబ్దాల క్రితం కబ్జాదారులకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అయితే, ప్రస్తుతం ఇద్దరూ లొంగిపోవడానికి ముందుకు వచ్చారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ రాష్ట్రస్థాయి నాయకుడు చొరవ తీసుకుని వారిని పోలీసుల ముందుకు తెచ్చినట్టు తెలుస్తోంది. వయసు మీద పడడం, ఆరోగ్యం సహకరించకపోవడంతో పురుషోత్తం, వినోదిని లొంగిపోవడానికి ముందుకు వచ్చినట్టు సమాచారం.

మావోయిస్టు పార్టీలో వారిద్దరూ కీలక నేతలు. సెంట్రల్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. మావోయిస్టు అగ్రనేతలైన గణపతి, ఆర్కే, కిషన్‌లతో సుమారు పాతికేళ్లపాటు కలసి పనిచేశారు. మావోయిస్టుల దాడులకు సంబంధించి వ్యూహరచనలో దిట్ట అని పురుషోత్తంకు పేరుంది. లొంగిపోవడానికి ముందు వరకు ఆయన మావోయిస్టు పార్టీ ప్రచార కమిటీ సెక్రటరీగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో కేవలం ఆదివాసీలను మాత్రమే భాగస్వామ్యం చేస్తున్నారని.. మిగిలిన వారిలోకి మావోయిస్టు భావజాలాన్ని తీసుకెళ్లడంలో అగ్రనాయకత్వం విఫలం అయిందని పురుషోత్తం అన్నారు. జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు పునరావాసం కల్పించేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు తెలిపారు.


ఇవి కూడా చదవండి
First published: October 9, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>