(జి.శ్రీనివాసరెడ్డి, న్యూస్18 తెలుగు, ఖమ్మం జిల్లా)
ఇంకా ప్రాచుర్యంలో ఉన్న మావోయిస్టు టాప్ క్యాడర్, యాక్షన్ కమిటీ నేతలు సైతం కరోనా బారిన పడినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం చత్తీస్ఘడ్ పోలీసుల నిఘా వర్గాలకు అందిన సమాచారం ప్రకారం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) బెటాలియన్-1కు కమాండర్‌గా ఉన్న మడవి హిడ్మా సైతం కరోనా కోరల్లో చిక్కకున్నట్టు తెల్సింది. హిడ్మా గత ఏప్రిల్ 3వ తేదీన బీజపూర్ జిల్లాలో చోటుచేసుకున్న 23 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ఊచకోతకు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. అప్పటిదాకా పెద్దగా ప్రాచుర్యంలోకి రాని హిడ్మా ఈ ఘటనతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. తాజాగా కరోనా సెకండ్ వేవ్ ధాటికి హిడ్మా సైతం కరోనా సోకి బాధపడుతున్నట్టు సమాచారం. దీంతో అతనికి అడవిలోనే అందుబాటులో ఉన్న వైద్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. వీరితో పాటుగా కొద్ది రోజుల క్రితం మృతిచెందిన మావోయస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ భార్య జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారద కూడా కరోనా పాజిటివ్‌తో బాధపడుతున్నట్టు నిఘావర్గాలకు తెలిసింది. దీంతో అటు చత్తీస్ఘడ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం సైతం కరోనా తో బాధపడుతున్న మావోయిస్టులు ఎవరైనా, ఏ క్యాడర్ వారైనా లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వస్తే వారికి మెరుగైన వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. అయినా మావోయిస్టుల వైపు నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు అందలేదు.
కాయకల్ప చికిత్స ఏపాటి..
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కు మించిన నివారణ లేదని ఓ వైపు వైద్యులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. చికిత్స పరంగా ఇప్పటిదాకా చేస్తున్న వైద్యం కూడా ఏదీ వందశాతం ఫలితాన్ని ఇవ్వని పరిస్థితి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన మెడికల్ ప్రోటోకాల్‌ను ప్రభుత్వాలు సైతం అమలు చేస్తున్నాయి. దీన్నే ప్రచారం కూడా చేశాయి. అయితే ఇక్కడ మావోయిస్టులు సైతం ఇలా అందుబాటులోకి వచ్చిన వైద్యాన్ని మాత్రమే అందించగలుగుతున్నారు. ఒకవేళ కరోనా సోకిన మావోయిస్టు నేతలు, క్యాడర్‌కు సైతం ప్రాథమికంగా ఇలాంటి వైద్యాన్ని చేస్తున్నా.. పరిస్థితి విషమించిన సమయాల్లో ఎమర్జెన్సీ వైద్యం అందుబాటులో లేదు. దీంతో అప్పటిదాకా బాగానే ఉన్నప్పటికీ సడెన్ డెత్‌లతో మావోయిస్టు క్యాడర్లో భయానక పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తోంది.
దీనికితోడు ఆన్లైన్ బ్రౌజింగ్ ద్వారా లేదా యూట్యూబ్ ద్వారా నేర్చుకున్న వైద్యం కూడా అన్నివేళలా ప్రాణాలు కాపాడదన్న విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. రోగి కండిషన్‌ను బట్టి చేయాల్సిన వైద్యాన్ని, అందరికీ కామన్‌గా అందిస్తే దుష్పలితాలు కలిగిస్తాయన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. దీనికితోడు మావోయిస్టు క్యాడర్లో సీనియర్లందరూ దాదాపు ఏభై ఏళ్లకు పైబడిన వారే కావడంతో వైరస్ ధాటిని తట్టుకోలేకపోతున్నారు. దీనికితోడు బీజపూర్లో సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి విజయవంతం కావడంతో రెట్టించిన ఉత్సాహంతో ఆదివాసీలతో చేపట్టిన వరుస సమావేశాలు కరోనా వ్యాప్తిని తీవ్రతరం చేసినట్టు అంచనా వేస్తున్నారు. అప్పటికే పలురకాల దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న మావోయిస్టు పార్టీ అగ్రనేతలకు వైరస్ వ్యాప్తి చెందడంతో అది క్యాడర్‌కు పాకింది. దీనికితోడు ఎలాంటి ఆధునిక వైద్య సదుపాయాలు లేని అటవీ ప్రాంతం కావడంతో వైరస్ సోకిన వారు ప్రాణాలతో బయటపడడం కష్టంగా మారింది.
మావోయిస్టు పార్టీకి ఈ కరోనా వైరస్ కష్టాలనే తెచ్చిందని చెప్పుకోవచ్చు. అత్యవసమైన ఆక్సీ మీటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్ల సదుపాయం లేకపోవడం బాగా నష్టం చేస్తోందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ మరణించిన అనంతరం మృతదేహాన్ని సైతం మావోయిస్టులు తమకు చూపలేదని.. కనీసం కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా వేదనకు గురిచేశారని ఆయన సోదరి భారతి ఆరోపిస్తున్నారు. హరిభూషణ్ అంత్యక్రియలు ఎక్కడ ఎలా చేశారో తెలీదని, చివరకు చితాభస్మాన్ని సైతం ఇవ్వలేదని.. తమకు కర్మకాండలు చేసే అవకాశం లేకుండా పోయిందని వాపోతున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.