Telangana Government: తెలంగాణలో మరో రెండు కొత్త మండలాలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ఏడు గ్రామాలు ఆ జిల్లా పరిధిలో..

తెలంగాణ ప్రభుత్వం Photo : Twitter

Telangana Government: తెలంగాణ రాష్ట్రంలో మ‌రో రెండు కొత్త మండ‌లాల‌ను ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్‌ను జారీ చేసింది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో మ‌‌హ‌మ్మ‌దాబాద్‌, వికారాబాద్ జిల్లాలోని చౌడాపూర్ ల‌ను కొత్త మండ‌లాలుగా ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ నోటిఫికేష‌న్ వెలువరించింది.

 • Share this:
  తెలంగాణలో మరో రెండు నూతన రెవెన్యూ మండలాల ఏర్పాటుపై 2020 డిసెంబర్‌ 31వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. 30 రోజుల్లో ప్రజల నుంచి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు స్వీకరించారు. అన్ని పరిశీలించిన తర్వాత శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ చౌడాపూర్‌, మహ్మదాబాద్‌ రెండు రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. పరిగి నియోజకవర్గం, మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండల పరిధిలోని మహ్మదాబాద్‌, సంగాయపల్లి, అన్నారెడ్డిపల్లి, ముకర్లాబాద్‌, లింగాయిపల్లి, మంగంపేట్‌, చౌదర్‌పల్లి, గాధిర్యాల్‌, నంచర్ల, జూలపల్లి రెవెన్యూ గ్రామాలతో మహ్మదాబాద్‌ రెవెన్యూ మండలంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిలో మొత్తం 10 గ్రామాలు ఉన్నాయి.   కుల్కచర్ల మండల పరిధిలోని మక్తవెంకటాపూర్‌, అడవి వెంకటాపూర్‌, లింగంపల్లి, చౌడాపూర్‌, మందిపల్‌, వీరాపూర్‌, విఠలాపూర్‌, గ్రామాలతో పాటు నూతన జిల్లాల ఏర్పాటు సమయంలో మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం పరిధిలోకి మారిన చాకల్‌పల్లి, కొత్తపల్లి, పుర్సంపల్లి, మల్కాపూర్‌, మరికల్‌, కన్మన్‌కల్వ, మొగిలిపల్లి రెవెన్యూ గ్రామాలతో నూతన రెవెన్యూ మండలంగా చౌడాపూర్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తుది నోటిఫికేషన్‌ జారీ చేశారు. మొత్తం 14 గ్రామాల‌తో చౌడాపూర్ మండ‌లం ఏర్పాటైంది.

  ఏడు రెవెన్యూ గ్రామాలు వికారాబాద్ జిల్లాలో..
  నూతనంగా ఏర్పడిన చౌడాపూర్‌ మండలం వికారాబాద్‌ జిల్లా వికారాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో, మహ్మదాబాద్‌ మండలం మహబూబ్‌నగర్‌ జిల్లా మహబూబ్‌నగర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉంటాయి. తద్వారా నూతన జిల్లా ఏర్పాటు సమయంలో మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోకి మారిన కుల్కచర్ల మండలంలోని 7 రెవెన్యూ గ్రామాలు మళ్లీ వికారాబాద్‌ జిల్లా పరిధిలోకి వచ్చాయి.

  దీంతో రెండు కొత్త మండలాల ఏర్పాటుతో పరిగి నియోజకవర్గంలో మండలాల సంఖ్య ఏడుకు పెరిగింది. ఈ మండలాలను ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.
  Published by:Veera Babu
  First published: