Home /News /telangana /

TWO MAOISTS KILLED IN ENCOUNTER IN KADAMBA FOREST IN ASIFABAD SK

తెలంగాణ అడవుల్లో మళ్లీ అలజడి.. ఎన్‌కౌంటర్‌తో మూడు జిల్లాల్లో హైఅలర్ట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత, తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యుడు భాస్కర్ అలియాస్ అడెల్లు తృటిలో తప్పించుకున్నాడు. ఘటనా స్థలంలో రెండు తుపాకులతో పాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

    తెలంగాణలోని కొమ్రంభీమ్ అసిఫాబాద్ జిల్లాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని కడంబ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. ప్రాణహిత నది సమీపంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. చనిపోయిన వారిలో ఒకరిని మంగిదళానికి చెందిన కోయ వర్గీస్‌ (ఛత్తీస్‌గఢ్)గా గుర్తించారు. మరొకరు మహిళా మావోయిస్టుగా తెలుస్తోంది. ఐతే ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత, తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యుడు భాస్కర్ అలియాస్ అడెల్లు తృటిలో తప్పించుకున్నాడు. ఘటనా స్థలంలో రెండు తుపాకులతో పాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

    అసిఫాబాద్ జిల్లా ఎస్పీ, రామగుండం పోలీసు కమిషనర్‌ సత్యనారా యణ, ఏఎస్పీ సుధీంద్ర సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం ఎనిమిది గ్రేహౌండ్స్‌ బృందాలు, ఆరు స్పెషల్‌ పార్టీలు పాల్గొన్నాయి. కాల్పుల్లో మృతి చెందిన వర్గీస్‌ ఇటీవలే ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి ఏరియా కమిటీ సారథిగా నియమితులయ్యారు. ఆయనపై ఐదు లక్షల రూపాయల రివార్డు ఉంది. ఇక 25 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న భాస్కర్‌ అలియాస్ తలపై రూ.20 లక్షల రివార్డు ఉంది. అతడు తప్పించుకోవడంతో పట్టుకునేందుకు కడంబ అటవీ ప్రాంతాన్ని గ్రేహౌండ్స్ జల్లెల పడుతున్నాయి. 400 మంది సిబ్బంది అభయారణ్యంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

    అసిఫాబాద్‌లో తప్పించుకున్న మావోయిస్టులు వరంగల్ జిల్లా వైపు వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించి మావోయిస్టుల కోసం వేట కొనసాగిస్తున్నారు.

    భాస్కర్‌ నేతృత్వంలోని ఐదుగురు దళ సభ్యులు ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం నుంచి మహారాష్ట్ర, అక్కడి నుంచి ప్రాణహిత మీదుగా కొన్నాళ్ల కిందట ఆసిఫాబాద్‌లో ప్రవేశించారు. ఏజెన్సీలో వారి కదలికలు గుర్తించిన పోలీసులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. గత నెలలో తిర్యాణి మండలం అడవుల్లో కాల్పులు జరగగా మావోయిస్టులు తృటిలో తప్పించుకున్నారు. అప్పటి నుంచి కూంబింగ్ మరింత ముమ్మరం చేశారు. ఈ నెల 2న ఆసిఫాబాద్‌ వెళ్లిన డీజీపీ మహేందర్‌ రెడ్డి ఐదురోజుల పాటు ఇక్కడే మకాం వేశారు. మావోయిస్టుల ఆపరేషన్‌పై స్థానిక పోలీసులకు పలు సూచనలు చేశారు.

    కాగా, కొద్దిరోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుసగా రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఒక ఘటనో ఇద్దరు, మరో ఘటనలో ఒక మావోయిస్టు చనిపోయాడు. అప్పటి నుంచే మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్ చేస్తున్నారు పోలీసులు. ఇటు మహారాష్ట్ర సరిహద్దుతో పాటు ఛత్తీస్‌ఢ్ సరిహద్దుల్లోనూ ముమ్మరంగా గాలిస్తున్నారు. వరుస ఎన్‌కౌంటర్లలతో ఏజెన్సీలోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఏజెన్సీలో ఎప్పుడు ఏం జరుగుతుందోని ఆందోళన చెందుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Asifabad, Maoists, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు