(K.Veeranna,News18,Medak)
వేగం కంటే ప్రాణం విలువైనదని ట్రాఫిక్ పోలీసులు(Traffic police)నెత్తి నోరు కొట్టుకొని చెబుతున్నా ఎవ్వరూ వినడం లేదు. వాహనాలతో రోడ్లపైకి రాగానే ఆకాశంలో విసరిస్తున్నట్లుగా ఫీలవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మెదక్(Medak)జిల్లాలో ఓ ట్రాక్టర్ tractor డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. అందరూ చూస్తుండగానే రోడ్డు పక్కన నడుస్తున్న విద్యార్ధులపైకి ట్రాక్టర్ దూసుకుపోవడంతో ఇద్దరు చనిపోగా..ఒకరి కాలు విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి..
మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో అభం,శుభం తెలియని ఇద్దరు విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. జస్వంత్, రజనీకాంత్, రామ్‌చరణ్ అనే ముగ్గురు విద్యార్దులు తలనొప్పి కారణంగా స్కూల్‌కి వెళ్లలేదు. హాస్టల్‌కి నడుచుకుంటూ రోడ్డు పక్కన వెళ్తున్న సమయంలో డ్రైవర్ అతివేగంగా నడపటంతో ట్రాలీతో ఉన్న ట్రాక్టర్ ముగ్గురు విద్యార్ధులను ఢీకొట్టింది. ఈ ఘటనలో రజనీకాంత్ అనే విద్యార్ధి స్పాట్లో మృతి చెందగా జశ్వంత్ అనే మరో విద్యార్ధిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. రామ్‌చరణ్ అనే మరో విద్యార్దికి రెండు కాళ్లు విరగడంతో ఆసుత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ముగ్గురిలో ఇద్దరు స్పాట్ డెడ్..
ఒక్క ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రంగంపేట దగ్గర రోడ్డు రక్తంతో తడిసిపోయింది. బిడ్డలు చనిపోయిన విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. మెదక్ పట్టణం నర్సిఖేడ్ చెందిన తూర్పట్ల శంకర్, లక్ష్మి దంపతుల కుమారుడు రజనీకాంత్. రంగంపేట స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో స్పాట్లో మృతి చెందాడు. మెదక్‌లోని గోల్కండ వీధిలోని సాంఘీక సంక్షేమ హాస్టల్లో ఉంటూ 9వ తరగతి చదువుతున్నాడు మరో విద్యార్ది జశ్వంత్. తల్లి పోచమ్మకు జశ్వంత్ ఒక్కడే బిడ్డ కావడంతో బిడ్డ చనిపోయిన వార్తను తట్టుకోలేకపోయింది. కన్నీటిపర్యంతమైంది. తలనొప్పి కారణంగా వీళ్లిద్దరూ స్కూల్‌కి వెళ్లకుండా హాస్టల్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది.
తీవ్రంగా గాయపడ్డ మరో స్టూడెంట్..
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మరో విద్యార్ది రామ్‌చరణ్‌కి రెండు కాళ్లకు తీవ్రగాయలవడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం హాస్టల్ వార్డెన్ అంటూ విద్యార్ధుల తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వార్డెన్ స్థానికంగా ఉండకుండా వారానికి ఒకటి రెండ్రోజులు మాత్రమే వసతి గృహంలో ఉండక పోవడంతో పాటు నెలకు ఒకసారి, రెండుసార్లు మాత్రమే వసతి గృహానికి వస్తున్నారని దీంతో విద్యార్థులు వసతి గృహంలో ఉండి కూడా పాఠశాలకు రావడంలేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
తల్లిదండ్రుల ఆగ్రహం ..
వసతి గృహ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని రంగంపేట పరిసర గ్రామాల ప్రజలు సుమారు గంటసేపు జస్వంత్ శవాన్ని ఆసుపత్రికి తరలించకుండా పోలీసులను అడ్డుకున్నారు. మెదక్ రూరల్ సీఐ విజయ్, కొల్చారం ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, రూరల్ ఎస్ఐ సంతోష్ రెడ్డిలు సంఘటన స్థలాన్ని సందర్శించి గ్రామస్తులకు నచ్చజెప్పి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.