భూ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ రైతులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. తహశీల్దార్‌ను కాళ్లా వేళ్లా బతిమిలాడినా ఇప్పటికీ చాలా చోట్ల రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇలా అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన రైతులు.. ఆత్మహత్యే శరణ్యమని ప్రాణాలు తీసుకుంటున్నారు. తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. భూ సమస్యలను పరిష్కరించడం లేదన్న మనస్థాపంతో కలెక్టరేట్ కార్యాలయంలో తండ్రీ కొడుకులు ఆత్మహత్యాయత్నం చేశారు. దామరగిద్ద మండలం క్యాతనపల్లి గ్రామానికి చెందిన రైతులు పురుగుల మందు సేవించి అక్కడే కుప్పకూలారు. వెంటనే అప్రమత్తమైన కలెక్టరేట్ సిబ్బంది..వారిద్దరిని హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణలో సమగ్ర భూ సర్వే చేసి కొత్త పాస్ పుస్తకాలు జారీ చేశారు. ఆ సమయంలో చాలా మంది సమస్యలు పరిష్కారం కాలేదు. ఇప్పటికీ పాస్ పుస్తకాలు రాక ఎంతో మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అందించే రైతు బంధు సాయానికి కూడా నోచుకోవడం లేదు. రెవెన్యూ అధికారుల తీరుపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తెస్తామని కొన్ని రోజుల క్రితం సీఎం కేసీఆర్ ప్రకటించారు. వీఆర్వో, ఎమ్మార్వో వ్యవస్థలను రద్దుచేసి భూముల బాధ్యతలను వ్యవసాయ అధికారులకు కట్టబెడతారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ చట్టంపై అధికారిక ప్రకటన రాలేదు. ఐతే త్వరలో జరగనున్న వర్షాకాల అసెంబ్లీ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmers suicide, Telangana