టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఫోర్జరీ, నిధుల దారి మళ్లింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా, రవిప్రకాశ్ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను తాజాగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. బెయిల్ కోసం హైకోర్టుకే వెళ్లాలని సూచించింది. పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. కాగా రవిప్రకాశ్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. న్యాయస్థానంలో వాదనల అనంతరం... రవి ప్రకాష్ ను అరెస్టు చేయాలని వస్తే.. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. అలాగే 41ఏ నోటీసు కింద విచారణకు హాజరు కావాలని రవి ప్రకాష్ కు ఆదేశించింది. జూన్ 10న ముందస్తు బెయిల్ పై నిర్ణయం తీసువాలని హైకోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఇదిలా ఉంటే టీవీ 9లో అవకతవకలు జరిగినట్లు కొత్త యాజమాన్యం పేర్కొన్నప్పటి నుంచి రవిప్రకాశ్ కనిపించకుండా పోయారు. ఈయనతో పాటు సినీ నటుడు శివాజీకి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ravi prakash, Supreme Court, TV9