హోమ్ /వార్తలు /తెలంగాణ /

Turmeric: పసిడి తగ్గుతోంది.. పసుపు పెరుగుతోంది... నాలుగేళ్లలో గరిష్టానికి పసుపు ధరలు

Turmeric: పసిడి తగ్గుతోంది.. పసుపు పెరుగుతోంది... నాలుగేళ్లలో గరిష్టానికి పసుపు ధరలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Turmeric Rates: కరోనా కాలంలో కొండెక్కిన బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. కానీ ఇన్నాళ్లు నేల చూపులు చూసిన పసుపు ధరలు మాత్రం ఒక్కసారిగా పెరుగుతున్నాయి.

 • News18
 • Last Updated :

  కొద్దిరోజులుగా ప్రపంచవ్యాప్తంగా పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా కాలంలో కొండెక్కిన బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. కానీ ఇన్నాళ్లు నేల చూపులు చూసిన పసుపు ధరలు మాత్రం ఒక్కసారిగా పెరుగుతున్నాయి. గ‌త నాలుగుళ్లలో ఎన్నడూ లేని విధంగా ప‌సుపు పంట‌కు ఈ యేడు మంచి ధ‌ర ప‌లుకుతుంది. ఈ యేడు ప‌సుపు పంట సీజన్ ప్రారంభంలో రూ. 4,500 లకు క్వింటాలు ధ‌ర ప‌లికింది. గురువారం సాంగ్లీ మార్కెట్ లో అదే క్వింటాల్ ధర రూ. 9,100 గా ఉంది. నిజామాబాద్ మార్కెట్ లో రూ. 7 వేల దాకా పిలికింది. దీంతో జిల్లా రైతులు వారి పంట‌లను పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్ కు త‌ర‌లించేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.

  నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజ‌న్, నిజామాబాద్ డివిజ‌న్ ప‌రిదిలో ప‌సుపు పంటను విరివిగా సాగు చేస్తారు. గ‌త నాలుగు సంవ‌త్సరాలుగా ప‌సుపు పంట‌కు ధ‌ర‌లు అంతంత మాత్రంగానే ఉండ‌డంతో ఈ యేడు ప‌సుపు పంట సాగు విస్థీర్ణం త‌గ్గింది. దీంతో ఉన్నట్టుండి ధరలు పెరిగాయి. మ‌రో వైపు విదేశాల నుంచి ప‌సుపు పంట‌ను దిగిమ‌తి త‌గ్గించడం వ‌ల్ల ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

  అయితే ప్ర‌తి యేటా నిజామాబాద్‌ మార్కెట్‌లో కంటే సాంగ్లీలో పసుపు పంటకు రేటు అధికంగా ఉంటుంది. అక్కడ క్వింటాలుకు రూ. 1,500 నుంచి రూ. 2 వేల వరకు ఎక్కువకు అమ్ముకోవచ్చు. ఇది రైతులకు లాభించే అంశం. గతేడాది నిజామాబాద్ మార్కెట్ లో క్వింటాలు పసుపు రూ. 4,500 పలికితే.. సాంగ్లీలో అదే ధర రూ. 6,500 గా ఉంది. ఇక ఈ ఏడాది ఇందూరులో క్వింటాకు రూ. 7 వేలు గా ఉండగా.. సాంగ్లీలో రూ. 9 వేలు దాటుతుండటం గమనార్హం.


  భూమి నుంచి తీసిన తర్వాత పసుపును శుద్ధి చేసే ప్రక్రియ...

  పసుపును భూమి నుంచి తీసిన తర్వాత ముందు దానిని వేడి నీటిలో ఉడికిస్తారు. తర్వాత దానిని ఆరబెట్టాలి. పాలిషింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి. పొడువు కొమ్ము, పూజ కొమ్ము వేరు చేయాలి. ఉడకని పసుపును వేరు చేయాలి. ఇలా ప‌ద్ద‌తిగా ఉంటే సాంగ్లీ వ్యాపారులు అధిక ధర చెల్లిస్తారు. తేమ శాతం అధికంగా ఉంటే రైతులు నష్టపోవాల్సి వస్తుంది. నిజామాబాద్ మార్కెట్‌లో మాత్రం ఈ ప‌ద్ద‌తులు ఏమి క‌నిపించడం లేదు. దీంతో మంచి ప‌సుపు పంట‌కు కూడా తక్కువే ధర చెల్లిస్తున్నారని రైతులు వాపోతున్నారు.

  లాభపడుతున్న రైతులు...

  తాజాగా నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం అంక్సాపూర్‌కు చెందిన బబ్బురు శ్రీనివాస్‌ అనే రైతు ఆరు ఎకరాల్లో పసుపు సాగు చేశారు. ఒక‌టిన్న‌ర ఎక‌రాల్లో పంటను తీయగా 42 క్వింటాళ్లు వచ్చింది.. సాంగ్లీకి తీసుకెళ్తే క్వింటాకు రూ. 9,100 పలికింది. మూడేళ్ల తర్వాత ఈ ధర పలకడంతో ఆ రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో రైతు.. వన్నెల్‌(బి)కి చెందిన అనిల్‌ క్వింటాలుకు రూ. 10 వేలతో అమ్ముకున్నాడు. ఇలా మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌లో పసుపు ధర అధికంగా పలుకుతుండటంతో జిల్లా రైతులు వారి ప‌సుపు పంటను ఆ మార్కెట్ కు త‌ర‌లిస్తున్నారు. మ‌హారాష్ట్ర‌లో ప‌సుపు పంట ఈ యేడు వ‌ర్షాల కార‌ణంగా దిగుబ‌డి త‌గ్గి.. వాడ‌కం పెరుగ‌డంతో అక్క‌డ ప‌సుపు పంటకు మంచి ధ‌ర ప‌లుకుతుంద‌ని విశ్లేష‌కులు బావిస్తున్నారు.. ఏదీ ఏమైనా ప‌సుపు పంట‌కు ధ‌ర పెర‌గ‌డం మాత్రం రైతులకు సంతోషకరమైన విషయం.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Maharashtra, Nizamabad, Telangana, Telangana News, Turmeric farmers

  ఉత్తమ కథలు