కరోనా లాక్డౌన్తో ఎన్నో రంగాలు కుదేలయ్యాయి. వాటిలో రవాణా వ్యవస్థ ముందు వరుసలో ఉంటుంది. రైళ్లు, విమానాలు, బస్సులు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో భారీ నష్టాలు వచ్చాయి. తెలంగాణలో ఆర్టీసీ ఆదాయానికి గండి పడింది. ఐతే నష్టాల నుంచి ఆర్టీసీని గట్టెక్కించుందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టిసారించింది టీఎస్ఆర్టీసీ. ఇప్పటికే కార్గో సేవలతో కాస్త ఉత్సాహంగా ఉన్నా సంస్థ.. మరో కార్యక్రమానికి అతి త్వరలో శ్రీకారం చుట్ట బోతోంది. సరికొత్త సేవలను ప్రజలకు అందుబాటులోకి తేబోంది. అవే ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్స్..!
ఎవరైనా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకోవాలంటే .. తెలిసిన వాళ్ల ద్వారా నేర్చుకుంటారు. లేదంటే డ్రైవింగ్ స్కూల్కు వెళ్తారు. బైకులు, కార్లు ఓకే... మరి భారీ వాహనాలను నేర్చుకోవాలంటే కట్టదిట్టమైన శిక్షణ అవసరం. భారీ వాహనాల డ్రైవింగ్ నేర్పించే సంస్థలు ఎక్కడా లేవు. ఈ నేపథ్యంలో ఆర్టీసీలోని సీనియర్ డైవర్ల ద్వారా డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా.. ఆర్టీసీ పరిధిలో మొత్తం 9 డిపోలు ఉండగా అన్ని జిల్లా కేంద్రాల్లో డ్రైవింగ్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. జిల్లా కేంద్రంలోని డిపోలో శిక్షణ కేంద్రాలు నెలకొల్పి ఆదాయాన్ని పెంచుకునేందుకు డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇందుకోసం ఆర్టీసీలో ఉన్న సీనియర్ డ్రైవర్ల ద్వారా అభ్యర్థులకు మెరుగైన శిక్షణ ఇవ్వనున్నారు.
ఒకవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెతో మరోవైపు కరోనా వైరస్ దాటికి చాలా రోజుల పాటు ఆర్టీసీకి ఆదాయం లేక నష్టాల్లోకి వెళ్ళిపోయింది సంస్థ. ఒక అడుగు ముందుకేసి కార్గో పార్సెల్ సేవలను ప్రారంభించి ఆదాయ మార్గం పెంచుకుంది. త్వరలో డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించి మరింత ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో డిపోల వారిగా రోజు 841 బస్సులు తిరుగుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. రీజినల్ పరిధిలో ఆర్టీసీ బస్సులు రోజుకి.2.20 లక్షలు కిలోమీటర్లు తిరుగుతున్నాయి. దీంతో రోజువారీగా అన్ని డిపోల నుంచి ఆర్టీసీకి 55 లక్షల ఆదాయం సమకూరడం ఉందని అధికారులు చెబుతున్నారు.
జిల్లా కేంద్రాలైన మహబూబ్ గర్, గద్వాల్, వనపర్తి ,నారాయణపేట, నాగర్ కర్నూల్లో మాత్రమే ఆర్టీసీ డ్రైవింగ్ స్కూళ్లను ప్రారంభించనున్నారు. దీనికోసం అధికారులు ఆర్టీసీ పరిధిలో ప్రత్యేక వాహనాలను ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు. అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ ఇచ్చేందుకు ప్రతి వాహనానికి డబుల్ స్టీరింగ్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
డ్రైవింగ్ స్కూల్ కు అధికారులు ప్రకటించిన విధి విధానాలు:
ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కేంద్రం తెరచి ఉంటుంది.
శిక్షణ పొందే అభ్యర్థి రూ.15,500 వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
18 ఏళ్ల వయసుపైబడిన వారు మాత్రమే శిక్షణకు అర్హులు.
అభ్యర్థులు శారీరక దారుఢ్యం కలిగి ఉండాలి.
లైట్ మోటర్ వెహికల్ లైసెన్సులు పొంది తప్పనిసరిగా ఏడాది పూర్తి అయి ఉండాలి.
డ్రైవింగ్ స్కూల్ వెసులుబాటును బట్టి ఒక అభ్యర్థికి 36 రోజులపాటు శిక్షణ ఇస్తారు
మొత్తం 16 గంటలు థియరీ తరగతులు, 20 గంటలు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తారు.