Home /News /telangana /

TSRTC TELANGANA INTER STATE BUSES RESUME OPERATIONS TODAY NK

TSRTC: తెలంగాణ నుంచి మొదలైన అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు... పూర్తి వివరాలు ఇవీ...

తెలంగాణ నుంచి మొదలైన అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు (File)

తెలంగాణ నుంచి మొదలైన అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు (File)

Telangana State RTC Buses: ప్రభుత్వం, అధికారులు, ప్రజలు... అందరూ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిరిగితే బాగుండని చూశారు. ఈ కల నిజం చేస్తూ అధికారులు... అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభించారు.

  Telangana State RTC Buses: తెలంగాణ ప్రభుత్వం కరోనాపై మెల్లమెల్లగా విజయం సాధిస్తూ... అదే సమయంలో... ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఈమధ్యే హైదరాబాద్‌లో బస్సు సర్వీసులు ప్రారంభించిన ప్రభుత్వం... ఆలస్యం చెయ్యకుండా... తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా బస్సు సర్వీసులను నేడు ప్రారంభించింది. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి కాబట్టి... ఏపీకి కాకుండా... కర్ణాటక, మహారాష్ట్రకు బస్సు సర్వీసులను ప్రారంభించింది. మొత్తం 600 బస్సుల్ని రోడ్డుపైకి పంపింది. దాంతో 6 నెలల తర్వాత అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తెలంగాణలో ప్రారంభమైనట్లు అయ్యింది. ఉదయం 5.30కి మొదటి సర్వీసులు మొదలయ్యాయి. ఈ సర్వీసులకు సీఎం కేసీఆర్ నాలుగు రోజుల కిందట గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో... నష్టాల్లో ఉన్న టీఎస్ఆర్టీసీ ఊపిరి పీల్చుకుంది.

  ఇవాళ కర్ణాటకలోని బెంగళూరు కాకుండా మైసూరు, గంగావతి, బీదర్, గుల్బర్గా, రాయచూరు ప్రాంతాలకు బస్సులు నడుస్తాయి. మహారాష్ట్రలో.. ముంబై, పుణె, నాగపూర్, నాందేడ్, చంద్రపూర్ షిర్డీలకు బస్సులు వెళ్తాయి. దీని వల్ల టీఎస్ఆర్టీసికి రోజూ రూ.40లక్షల నుంచి రూ.50లక్షల దాకా ఆదాయం వస్తుందని అంచనా వేశారు.

  ఏపీకి సర్వీసుల సంగతేంటి?
  ఈ వార్త చదవగానే చాలా మంది నుంచి వచ్చే ప్రశ్న ఇది. నిజమే... ఏపీకి అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభిస్తే... ఆదాయం అదిరిపోతుంది. టీఎస్ ఆర్టీసీ కూడా దీనికి రెడీగానే ఉన్నా... ప్రభుత్వమే కాస్త ఆలోచిస్తోంది. సమస్యేంటంటే... రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల అగ్రిమెంట్‌ సెట్ కావట్లేదు. విజయవాడ, హైదరాబాద్ మధ్య బస్సులన్నీ తామే నడుపుతామని టీఎస్ఆర్టీసీ అంటోంది. అందుకు ఏపీఎస్ ఆర్టీసీ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే... రెండు రాష్ట్రాల మధ్యా ఎక్కువగా తిరిగేది ఆ రూట్ బస్సులే. కర్ణాటకలోని బెంగళూరుకు బస్సులు ఏపీ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. డీల్ సెట్ కాలేదు కాబట్టి... బెంగళూరుకు ప్రస్తుతం నడపదలచుకోలేదు. ఈ వారంలో మరోసారి ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారులు సమావేశమై మేటర్ తేల్చేస్తారని అనుకుంటున్నారు.

  హైదరాబాద్‌లో బస్సులకు నో రష్:
  హైదరాబాద్‌లో మొదటి రెండ్రోజులూ బస్సులు ఎక్కని ప్రజలు... ఆ తర్వాత కూడా పెద్దగా ఎక్కట్లేదు. ఇందుకు కారణం ఆల్రెడీ సొంత వాహనాలు కొనుక్కోవడం, తక్కువ బస్సులున్నాయి కాబట్టి టైముకి వస్తాయో రావో అనే డౌట్. అందువల్ల ఇతర మార్గాల్ని ప్రజలు ఫాలో అవుతున్నారు. ఇది గమనించిన టీఎస్ ఆర్టీసీ... రెండు వారాల్లో 70 శాతం సిటీ బస్సులు నడుపుతామని చెప్పింది. ఈ విషయంలో అధికారుల మాట మరోలా ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు చాలట్లేదనీ, అందుకే పెంచాలని నిర్ణయించుకున్నామని చెబుతున్నారు. ఏది ఏమైతేనేం... బస్సుల సంఖ్య పెరిగిత మంచిదే. ఆర్టీసీకీ ఆదాయం పెరుగుతుంది, ప్రజలకూ మేలే. కనీసం 50 శాతం బస్సుల్ని నడిపినా... ప్రతీ రూట్లో ప్రతి 15 నిమిషాలకు ఓ బస్సు నడిపే ఛాన్స్ ఉంటుందంటున్నారు.

  అన్ని జాగ్రత్తలతో:
  సిటీ బస్సులు అనగానే... కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నారో లేదో అనే డౌట్ మనకు ఉంటుంది. టీఎస్ ఆర్టీసీ ప్రస్తుతానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. శానిటైజ్ చేసిన బస్సులకు... అలా చేసినట్లుగా స్టిక్కర్ అంటిస్తున్నారు. అలాగే... సీట్లపై మార్కింగ్ పెడుతున్నారు. ఆ మార్కింగ్ ఉన్నచోట కూర్చోవద్దని చెబుతున్నారు. అలా... సీటుకి ఒకరు మాత్రమే కూర్చునేలా చేస్తున్నారు. బస్సు ఎక్కగానే కండక్టర్... శానిటైజర్ స్ప్రే చేస్తున్నారు. సేఫ్ డిస్టాన్స్ అమలయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి రష్ తక్కువగా ఉంది కాబట్టి... ఇవన్నీ బాగానే అమలవుతున్నాయి.

  హైదరాబాద్‌లో మార్చి 22 నుంచి బస్సు సర్వీసులు ఆగిపోయాయి. ఆరు నెలలుగా బస్సులు డిపోల్లోనే ఉన్నాయి. టీఎస్ ఆర్టీసీ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. కరోనాకి ముందు టీఎస్ ఆర్టీసీ 1400 రూట్లలో 3వేలకు పైగా బస్సులతో 43వేల ట్రిప్పులు నడిపేది. రోజూ 30 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చేది. ఇప్పుడు బస్సులు తిరిగి నడుస్తుండటంతో ప్రయాణికులకు ఒకింత ఉపశమనం కలుగుతోంది.
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Tsrtc

  తదుపరి వార్తలు