Home /News /telangana /

TSRTC STRIKE CM KCR DISMISSED ALL THE EMPLOYEES WHO PARTICIPATED IN STRIKE SK

కేసీఆర్ సంచలన ప్రకటన.. సమ్మెలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల తొలగింపు

కేసీఆర్, ఆర్టీసీ

కేసీఆర్, ఆర్టీసీ

  తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులందరినీ విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ విధించిన గడువు లోపల విధులకు హాజరుకాని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోబోమని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో ప్రస్తుతం 1200 మంది సిబ్బంది మాత్రమే మిగిలి ఉన్నారని ప్రకటించారు సీఎం. ఇక అతి కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బందిని నియమించాలని, నియామక ప్రక్రియ అతిత్వరగా చేపట్టాలని, కొత్తగా చేర్చుకునే సిబ్బంది యూనియన్లలో చేరమని ఒప్పంద పత్రం మీద సంతకం చేయాలని, కొత్త సిబ్బందిది షరతులతో కూడిన నియామకం అవుతుందని, ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంటుందని కేసీఆర్ స్పష్టంచేశారు. అంతేకాదు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.

  ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు పోవాలనీ, సంస్థ మనుగడ కొనసాగాలంటే కొన్ని చర్యలు తప్పవన్నారు సీఎం. ఏడాదికి రూ.1200 కోట్ల నష్టంతో, రూ. 5000 కోట్ల రుణభారంతో, క్రమబద్ధంగా పెరుగుతున్న డీజిల్ ధరలతో, ఆర్టీసీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో చట్ట విరుద్ధమైన సమ్మెకు దిగడం తీవ్రమైన తప్పు అని అన్నారు. ఇక వారితో ఎలాంటి చర్చలు జరిపేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. యూనియన్ల బ్లాక్‌మెయల్ రాజకీయాలకు ప్రభుత్వం తలవంచదన్నారు తెలంగాణ సీఎం.

  ఆర్టీసీ చేస్తున్న సమ్మె చట్ట వ్యతిరేకం. మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, చత్తీస్ ఘడ్, మణిపూర్ రాష్ట్రాలలో ఆర్టీసీ లేనే లేదు. చాలా రాష్ట్రాల్లో నామ మాత్రంగా వున్నాయి. కర్నాటక తరువాత తెలంగాణలో అత్యధికంగా బస్సులు నడుస్తున్నాయి. ఇంత మంచిగా ఆర్టీసీని చూసుకుంటుంటే సమ్మెకు దిగడం అవసరమా? సీపీఎం అధికారంలో ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసారా? కేరళలో చేసారా? బీజేపీ ఎన్నో రాష్ట్రాలలో అధికారంలో ఉంది. కాని ఎక్కడైనా విలీనం చేసారా? కాంగ్రెస్స్ పార్టీ ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలోనైనా చేశాయా? అందుకే వాళ్లకు అడిగే హక్కు లేదు. అఖిల పక్ష సమావేశం డిమాండ్ అసంబద్ధం.
  కేసీఆర్


  ఇకపై ఆర్టీసీ బస్సుల్లో సగం ప్రయివేట్ బస్సులుంటాయని, మిగతా సగం ఆర్టీసీ యాజమాన్యానివని ప్రభుత్వం నిర్ణయించింది. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో చర్యలు చేపట్టితే బస్సులు బాగా నడుస్తాయి అభిప్రాయపడింది. రెండు-మూడేళ్ళలో సంస్థ నష్టాలను పూడ్చుకుని లాభాల్లోకి వస్తుందని తెలిపింది. ఇక తక్షణ చర్యగా 2500 బస్సులను అద్దె పద్ధతిలో తీసుకుని నడపాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. 4114 ప్రయివేట్ బస్సులు ఇంకా వున్నాయని.. స్టేజ్ కారేజ్‌గా చేస్తే వాళ్ళు కూడా ఆర్టీసీలోకి వస్తారని అభిప్రాయపడ్డారు. ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించి, ఒక నివేదిక సమర్పించడానికి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కమిటీలో సభ్యులుగా రవాణా శాఖ కమీషనర్ సందీప్ సుల్తానియా, టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమీషనర్ పాండురంగనాయకులున్నారు. వాళ్ళు తమ ప్రతిపాదనలను సోమవారం ప్రభుత్వానికి సమర్పిస్తారు.

  ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపి మహేందర్ రెడ్డి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ్ రావు, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, రవాణా శాఖ కమీషనర్ సందీప్ సుల్తానియా, అడిషనల్ డీజీపీ జితేంద్ర, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  First published:

  Tags: CM KCR, Rtc, Tsrtc, TSRTC Strike

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు