ప్రజలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) రెండు రోజుల ముందే షాకిచ్చింది. మరోసారి డీజిల్ సెస్ పెంచింది. ఆర్టీసీ బస్సుల్లో అదనపు డీజిల్ సెస్‌ను వసూలు చేస్తున్నారు కూడా. పల్లె వెలుగులో 250 కిలోమీటర్ల దూరానికి గాను రూ. 5 నుంచి 45కి, ఎక్స్‌ప్రెస్‌లో 500 కిలోమీటర్ల దూరానికి గాను రూ.5 నుంచి రూ.90కి, డీలక్స్ బస్సుల్లో 500 కిలోమీటర్లకు రూ. 5 నుంచి 125కి, సూపర్ లగ్జరీలో 500 కిలోమీటర్లకు రూ.10 నుంచి రూ.130కి, ఏసీ సర్వీసుల్లో 500 కిలోమీటర్లకు రూ.10 నుంచి రూ.170కి పెంచుతున్నట్లు ఆర్టీసీ తెలిపింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డీజిల్ సెస్ పెంపు లేదని యాజమాన్యం పేర్కొంది.
రూ 165 నుంచి 400 వరకు..
అయితే ఇంధన ధరలు అమాంతం పెరగడంతో ఆ ఎఫెక్ట్ విద్యార్థులపై (Students) కూడా పడింది. బస్‌పాస్ చార్జీలు (Bus pass charges) ఏకంగా రెండు రెట్లకు పైగా పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసకుంది. ఇప్పటి వరకు కేవలం రూ.165 తో నెల రోజుల పాటు ప్రయాణం చేసినవారు.. ఇక నుంచి ఏకంగా రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా బస్‌పాస్ చార్జీలను (Bus pass charges) పెంచడంతో పాటు రెండు దశాబ్దాల క్రితం నాటి రాయితీలను కూడా సవరించడంతో భారం రెండింతలైంది. దీంతో విద్యార్థుల చదువులకు ఇప్పుడు ఆర్టీసీ చార్జీలే గుదిబండగా మారాయి తెలంగాణలో.
మరోవైపు విద్యార్థుల బస్‌పాస్ రాయితీల నుంచి ఆర్టీసీ క్రమంగా తప్పుకొనేందుకే ఈ భారాన్ని మోపినట్లు పలు సంఘాలన నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిణామం పట్ల విద్యార్ధి సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. పెంచిన చార్జీలను (Bus pass charges) వెంటనే ఉపసంహరించుకోవాలని ద్యార్ధి సంఘాలు ఆర్టీసీని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం వివిధ రకాల విద్యార్థుల పాస్‌లపై ఆర్టీసీకి ప్రతి నెలా రూ.8 కోట్ల వరకు ఆదాయం లభిస్తుండగా చార్జీల పెంపుతో మరో రూ.15 కోట్లకుపైగా అదనంగా లభించనుంది. ప్రతి సంవత్సరం విద్యార్థులపై రూ.180 కోట్లకుపైగా అదనపు భారం పడనుంది.
ఈ నెల 10 నుంచి దరఖాస్తులు..
ఈ విద్యా సంవత్సరం కోసం విద్యార్థుల నుంచి ఆర్టీసీ బస్‌పాస్ (RTC Bus pass) దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 10 నుంచి దరఖాస్తులను స్వీకరించి 15 నుంచి జారీ చేయనుంది. కొత్త చార్జీల ప్రకారమే ఈ పాస్‌లను అందజేయనున్నారు. సుమారు 5 లక్షల మంది విద్యార్ధులు నెలవారీ, మూడు నెలల సాధారణ బస్‌పాస్‌లతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పాస్‌లు,రూట్ పాస్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. జిల్లా బస్సుల్లో నగర శివార్ల వరకు అనుమతించే బస్‌పాస్‌లు కూడా ఉన్నాయి.
రూ.490 నుంచి ఇప్పుడు ఏకంగా రూ.1200..
మూడు నెలల పాటు సిటీ బస్సుల్లో (City busses) ప్రయాణం చేసేందుకు తీసుకొనే క్వార్టర్లీ పాస్ ధర రూ.490 నుంచి ఇప్పుడు ఏకంగా రూ.1200కు పెరిగింది. ప్రతి రోజు ఒకే మార్గంలో రాకపోకలు సాగించేందుకు తీసుకొనే రూట్‌పాస్‌లు 8 కిలోమీటర్ల వరకు రూ.200 ఉండగా ప్రస్తుతం రూ.600కు పెంచారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ పెంచిన బస్‌పాస్ చార్జీలు గ్రేటర్‌లోని లక్షలాది మంది విద్యార్థులను బెంబేలెత్తిస్తున్నాయి. వెంటనే చార్జీలను తగ్గించాలని ఈ సందర్భంగా పలు వైపుల నుంచి ఆర్టీసీకి డిమాండ్లు పెరిగాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bus pas counters, Bus services, Charges, Telangana students, Tsrtc