ఆర్టీసీ ఉద్యోగులకు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కరువు భత్యం(డీఏ) పెరుగుతోంది. ఈ మేరకు ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ యాజమాన్యం నుంచి అతిత్వరలో తీపి కబురు అందనుంది. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు 5% కరువు భత్యం (డీఏ) ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆర్టీసీలో పనిచేస్తున్న 48 వేల మందితోపాటు 2019 జూలై నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది.
ఇటీవల బోర్డు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకొన్న ఆర్టీసీ యాజమా న్యం.. వాటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నది. ఆర్టీసీ చార్జీలను రౌండ్ ఫిగర్ చేయ డం, డీజిల్ సెస్సు విధించడం ద్వారా సంస్థ ఆదాయం స్వల్పంగా పెరగడంతో కార్మికుల సంక్షేమంపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా పెండింగ్‌లో ఉన్న 6 డీఏల్లో ప్రస్తుతానికి ఒకదాన్ని ఇవ్వాలని సోమవారం నిర్ణయించినట్టు సమాచారం.
మూల వేతనంపై ఐదు శాతం అంటే.. డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ వంటి యూనిఫారం ఉద్యోగులకు కనిష్టంగా రూ.600 నుంచి గరిష్టంగా రూ.1,500 వరకు భత్యం జతకలుస్తుంది. వివిధ కేటగిరీల్లోని అధికారులకు రూ.1,500 నుంచి రూ.5,500 వరకు వేతనం అదనంగా అందనుంది. ఈ డీఏ ప్రకటనతో ఆర్టీసీపై నెలకు రూ.5 కోట్ల వరకు భారం పడుతుం దని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి ఉద్యోగులు 2019లో సుదీర్ఘ సమ్మె చేయటం, తర్వాత కోవిడ్ దెబ్బతో.. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతిని, డీఏల చెల్లింపు ఆగిపోయింది.
ఆరు డీఏలు కలిపి 27శాతం వరకు రావాల్సి ఉందని.. వెంటనే చెల్లించా లని ఆర్టీసీ ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగులకు ఇచ్చే డీఏను 5 శాతం పెంచుతూ ఎండీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఏప్రిల్ నెలకు ఇచ్చే వేతనంతో కలిపి ఈ డీఏ డబ్బు కూడా చెల్లించాలని అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. డీఏ పెంపు నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి తరఫున టీఎంయూ జనరల్ సెక్రటరీ థామస్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఈ నిర్ణయం కార్యరూపం దాల్చుతుందో లేదో చూడాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.