కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. నేటి అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాల మధ్య సోమవారం హైదరాబాద్లో ఒప్పందం కుదిరింది. ఈ అవగాహన ఒప్పందంపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఏపీలో 1,61,258 కి.మీ. మేర టీఎస్ ఆర్టీసీ బస్సులు నడపనుంది. మరోవైపు తెలంగాణలో 1,60,999 కి.మీ. మేర 638 బస్సులను ఏపీఎస్ఆర్టీసీ తిప్పనుంది. ఇక, విజయవాడ రూట్ లో 273 తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిరగానుండగా.. అదే రూట్ లో 192 ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. కర్నూల్ టూ హైదరాబాద్ కర్నూల్ టు హైదరాబాద్ రూట్ లో 213 బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడపనుంది.
అలానే గుంటూరు హైదరాబాద్ వయా వాడపల్లి రూట్లో టీఎస్ఆర్టీసీ 57 బస్సు తిప్పనుంది ఇక అదే రూట్ లో ఏపీఎస్ ఆర్టీసీ 88 బస్సులు నడపనుంది. మాచర్ల సెక్టార్లో టి ఎస్ ఆర్ టి సి 66 బస్సులు తిప్పనండగా ఏపీ బస్సులు 61 తిరగనున్నాయి. నూజివీడు, తిరువూరు, భద్రాచలం-విజయవాడ రూట్లో 48 టీఎస్ ఆర్టీసీ బస్సులు, 45 ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. ఖమ్మం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం రోడ్లో 35 టీఎస్ ఆర్టీసీ బస్సులు , 58 ఏపీ బస్సులు నడవనున్నాయి.
ఇక, రాష్ట్ర విభజన నుంచి ఉమ్మడి రాష్ట్ర నిబంధనల ప్రకారమే ఆర్టీసీ బస్సులను నడిపినట్టు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. కరోనా కారణంగా మార్చి 22 నుంచి ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయని గుర్తుచేశారు. ఇప్పుడు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల ఒప్పందం ప్రకారం ఆర్టీసీ బస్సులు నడపబోతున్నట్టు చెప్పారు. ఈ ఒప్పందం అనంతరం తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీ , తెలంగాణల మధ్య రాకపోకలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. అందుకే ఇరు రాష్ట్రాలు మధ్య ఒప్పందం జరిగిందన్నారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచే ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడుస్తాయని చెప్పారు.