తెలంగాణలో జిల్లాలు, జోన్ల పునర్విభజనకు అనుగుణంగా టీచర్లు ఉద్యోగుల బదిలీ వ్యవహారంలో నెలకొన్న సమస్యలు మరింత జఠిలం అయ్యాయి. ప్రధానంగా పరస్పర బదిలీలు (మ్యూచువల్ ట్రాన్స్ ఫర్స్) విషయంలో ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది. పరస్పర బదిలీలు కోరుకునే ఉద్యోగులు, ఉపాధ్యాయులు అండర్‌టేకింగ్‌లు ఇవ్వాలని కేసీఆర్ సర్కారు తాజాగా ఆదేశించింది. ఈ ప్రక్రియకు శుక్రవారం (ము 27) సాయంత్రం వరకే డెడ్ లైన్ విధించడంతో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి.
పరసప్ర బదిలీలకు సంబంధిచి జీరో సీనియారిటీకి అంగీకరించడంతోపాటు, హైకోర్టు తుది తీర్పునకు కట్టుబడతామన్న షరతులతో అండర్‌టేకింగ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలా ఇచ్చినవారికే పరస్పర బదిలీలు చేస్తామని వెల్లడించింది. అండర్‌టేకింగ్‌లు ఇవ్వనివారి దరఖాస్తులను ఉపసంహరించుకున్నట్లే పరిగణిస్తామని ప్రకటించింది. ఈ మేరకు గురువారం పాఠశాల విద్య సంచాలకులు అంతర్గత ఉత్తర్వులు జారీచేశారు. దరఖాస్తుదారుల నుంచి అండర్‌టేకింగ్‌లు తీసుకోవాలంటూ పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్, జిల్లా విద్యాధికారులను ఆదేశించారు. నేటి (శుక్రవారం) సాయంత్రంలోగా అండర్‌టేకింగ్‌లను సమర్పించాలని పేర్కొన్నారు.
టీచర్లతోపాటు ఇతర శాఖల్లో ఉద్యోగుల బదిలీలపైనా అంటే, టీఎన్జీఓలు, గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులకు కూడా ఇలాంటి ఉత్తర్వులు వెలువడనున్నాయి. త్వరలో అన్ని శాఖల నుంచి అంతర్గత ఉత్తర్వులు జారీ అవుతాయని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ షరతులతో పరస్పర బదిలీలు జరిగేనా అన్న మీమాంసలో పడ్డారు. సీనియారిటీని కోల్పోతూ బదిలీలు చేసుకోవడం తమకు అవసరం లేదంటూ తెగేసి చెబుతున్నారు. మొదట్లో సీనియారిటీని రక్షిస్తామంటేనే దరఖాస్తు చేసుకున్నామని, ఇప్పుడు కోర్టు తీర్పునకు లింకు పెట్టి అండర్‌టేకింగ్‌లు తీసుకోవడం దారుణమని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
పరస్పర బదిలీల వ్యవహారంలో టీచర్లలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. పరస్పర బదిలీలకు అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి, ప్రభుత్వం తొండి చేస్తోందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.అండర్‌టేకింగ్ ఇస్తే... తర్వాత కోర్టు తీర్పు ఎలా వస్తుందో అన్న ఆందోళనలో ఉన్నారు. అలాగని ఇవ్వకపోతే.. దరఖాస్తును ఉపసంహరించుకున్నట్టు భావిస్తారు. దీంతో మొదటికే మోసం వస్తుంది. కాగా... మొత్తం 5వేల మందికిపైనే బదిలీల కోసం వేచిచూస్తున్నారు. అండర్‌టేకింగ్ షరతు వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు సీనియారిటీని కోల్పోయే ప్రమాదం ఉందని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. దరఖాస్తుదారుల్లో ఎక్కువగా సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులే ఉన్నారని.. ప్రభుత్వం చొరవ తీసుకుని సీనియారిటీని రక్షించాలని వారు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.