Home /News /telangana /

TS SSC EXAMS 2020 CANCELLED TELANGANA GOVT CANCELS SSC EXAMS ALL STUDENTS WILL BE PASSED SK

TS SSC Exams 2020: అందరూ పాస్.. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

TS SSC Exams 2020 Cancelled | విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. 5,34,903 మంది పదో తరగతి విద్యార్థులను ప్రమోట్ చేసింది.

    TS SSC Exams 2020: పదో తరగతి పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దుచేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక, ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని సీఎం  నిర్ణయించారు. దేశంలో, రాష్ట్రంలో ప్రబలివున్న సందర్భంలో పదవ తరగతి పరీక్షలపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు పాల్గొన్నారు.

    రాష్ట్రంలో 5,34,903 మంది పదవ తరగతి విద్యార్థులున్నారు. మొత్తం ఆరు సబ్జెక్టులు, 11 పేపర్లుండగా, అందులో రెండు సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు పూర్తయ్యాయి. ఆ సమయంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకోవడానికి సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని సిఎం నిర్వహించారు. ఈ సమావేశంలో పదవ తరగతి పరీక్షల విషయంలో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులను పరిశీలించారు. తెలంగాణలో ఏమి చేయాలనే విషయంలో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తెలంగాణలో అనుసరించాల్సిన పద్దతిని ఖరారు చేశారు.

    గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరగణలోకి తీసుకుని పదవ తరగతి విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
    డిగ్రీ, పిజి తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    పదో తరగతి పరీక్షలపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. వాటిపై కొన్ని రోజులుగా విచారణ జరుగుతోంది. ప్రభుత్వం పరీక్షలపై దృష్టిపెడుతోందని, రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని పిటిషనర్ వాదించారు. పంజాబ్‌ తరహాలో పరీక్షలు లేకుండానే విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని పిటిషనర్ వాదించారు. పరీక్షలు లేకుండా గ్రేడింగ్ ఇస్తే ఇబ్బందేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అలాగే, ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ మినహా మిగతా జిల్లాల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు సూచించింది. దీనిపై ఏజీ అభ్యంతరం తెలిపారు. వేర్వేరుగా పరీక్షలు పెడితే ప్రశ్నాపత్రం తయారుచేయడం కష్టమవుతుందని భావించిన ప్రభుత్వం.. రాష్ట్రమంతటా పదో తరగతి పరీక్షలను వాయిదా వేసింది. మరి ఏం చేయాలన్న దానిపై ఇవాళ అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్.. పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, Ssc exams, Telangana

    తదుపరి వార్తలు