వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. ఈనెల 28న పాదయాత్ర తిరిగి పునఃప్రారంభం కానుందని, ఎక్కడైతే పాదయాత్రకు బ్రేక్ పడిందో తిరిగి అక్కడ్నించే స్టార్ట్ చేయబోతున్నట్టు వైఎస్ షర్మిల తెలిపారు. మా సిద్ధాంతాలు బీజేపీ సిద్ధాంతాలు వేరు. మేము వేరొకరితో పొత్తు పెట్టుకున్నామని, మమ్మల్ని బీ టీం అని అనడం భావ్యం కాదన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ సెక్యులర్ పార్టీ అని, తమ పార్టీకి మతం కానీ కులం కానీ లేదన్నారు. కాగా నర్సంపేటలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు పాదయాత్రకు అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే.
అయితే దీనిపై షర్మిల (YS Sharmila) హైకోర్టుకు వెళ్లగా పాదయాత్రకు అనుమతినిచ్చింది. అయితే పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించగా..పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు. దీనితో ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబెడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన షర్మిల అక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది. కానీ ట్రాఫిక్, శాంతి భద్రతల దృష్యా పోలీసులు షర్మిల (YS Sharmila) ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేసి లోటస్ పాండ్ కు తరలించారు. కానీ ఆమె అక్కడే దీక్షకు పూనుకుంది.
పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని, అలాగే పార్టీ నాయకులను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకునేది లేదని షర్మిల (YS Sharmila) పట్టు బట్టారు. ఈ క్రమంలో అర్ధరాత్రి పోలీసులు దీక్షను భగ్నం చేసి అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో కేసీఆర్ కు బెడ్ పై నుండే వార్నింగ్ ఇచ్చారు. ఇక చికిత్చ అనంతరం డిసెంబర్ 13న షర్మిల ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.
ఇక పాదయాత్రకు హైకోర్టు (High Court) పర్మిషన్ ఇచ్చినా కూడా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని షర్మిల కోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు (High Court) విచారణ జరిపింది. కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చినప్పుడు పోలీసులు పాదయాత్రను ఎలా నిరాకరిస్తారని హైకోర్టు (High Court) ప్రశ్నించింది. షర్మిల (Ys Sharmila) పాదయాత్రకు అనుమతి ఇస్తున్నామని కానీ గతంలో సూచించిన షరతులను గుర్తు పెట్టుకోవాలని సూచించింది.
ఇక ఆ తరువాత షర్మిల పాదయాత్ర ప్రారంభంపై అనేక ఊహాగానాలు వినిపించగా తాజాగా 28 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్టు షర్మిల తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana, YS Sharmila, Ysrtp