Home /News /telangana /

TS POLITICS WYRA TRS MLA RAMULU NAYAK ONCE AGAIN MADE CONTROVERSIAL STATEMENTS AND PARTY ACTIVISTS IN CONFUSED KMM PRV

Khammam: మరోసారి నోరుజారిన TRS ఎమ్మెల్యే.. తలపట్టుకున్న కార్యకర్తలు.. అసలేం జరిగింది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆయనో టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే. నిన్నటికి నిన్న ఆయన ఒక సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సభికుల్ని ఆశ్చర్యానికి లోను చేయగా.. సోషల్‌మీడియాలో వైరల్​గా మారాయి.

  (G. SrinivasaReddy, News18, Khammam)

  లావుడ్యా రాములునాయక్‌ (Ramulu Naik). వైరా ఎమ్మెల్యే (Wyra MLA). ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచి తన సత్తా చాటినా.. మూణ్నాళ్లు తిరక్కుండానే అధికార తెరాస (TRS) తీర్థం పుచ్చుకుని అందరినీ ఆనాడే విస్మయానికి గురిచేశారు. పోలీసుశాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన రాములునాయక్‌.. ఎస్సైగా వివిధ స్టేషన్లలో పనిచేసిన తాను.. అదే ప్రాంతానికి ఎమ్మెల్యే అవుతానని ఊహించి ఉండరు. భోళాగా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే అలవాటున్న రాములునాయక్‌కు ఇప్పటికీ రాజకీయ చాణక్యం, లౌక్యం అలవడలేదంటుంటారు ఆయన అనుయాయులు. సాధారణంగా ప్రజలతో మాట్లాడే సమయంలో ఎలా మాట్లాడినా.. మైకు తీసుకోగానే ఆయన రెట్టించిన ఉత్సాహంతో తనకు ఏది తోస్తే అదే కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంటారు. ఏదీ దాచుకునే తత్వం లేకుండా పైకి అనేసే ఎమ్మెల్యే రాములునాయక్‌ (MLA Ramulu naik) తత్వం కొన్ని సందర్భాలలో ఆయనకే ఇబ్బందులు తెచ్చిపెడుతున్నది. ఇలా ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గరి నుంచి పలుమార్లు చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయని చెప్పొచ్చు.

  రాములు నాయక్​


  ఈ సర్వేలు గిర్వేలు ఏం లేదు...

  నిన్నటికి నిన్న ఆయన ఒక సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సభికుల్ని ఆశ్చర్యానికి లోను చేయగా.. సోషల్‌మీడియాలో వైరల్​గా మారాయి. '.. ఈ సర్వేలు గిర్వేలు ఏంలేదు. ఇక్కడ మళ్లీ నేనే పోటీ చేస్తా.. నేనే గెలుస్తా.. నేను గెలిస్తే కేసీఆర్‌ (KCR) గెలిచినట్టే.. మా ప్రభుత్వం మళ్లీ వచ్చినట్టే. గతంలో కమ్యూనిస్టు పార్టీలు ప్రజలకు అవి కావాలి. ఇవి కావాలి అంటూ పోరాటాలు చేసేవి. ఇప్పుడా అవసరం కూడా లేకుండా.. అవసరమైన వారికి అన్నీ మా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చేస్తున్నారు”అని అన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే రాములునాయక్‌ (MLA Ramulu Naik) ఓ సమావేశంలో పాల్గొనడానికి మల్లు భట్టివిక్రమార్క స్వగ్రామమైన వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామానికి వెళ్లారు​. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భట్టివిక్రమార్కను పొగడ్తలతో ముంచెత్తారు.  నేను కూడా కాంగ్రెస్‌ వాదిని..  'భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) చాలా మంచోడు. నా ఎదుగుదలలో ఆయన పాత్ర ఉంది. ఆయన మంచి సలహాలు ఇస్తుంటారు. ఆయన లాగే నేను కూడా కాంగ్రెస్‌ వాదిని అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. టీఆర్​ఎస్​ (TRS) నేతలు వేదిక పైన ఉండగానే ఎమ్మెల్యే రాములు నాయక్‌ ఇలా వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ జిల్లా పర్యటనకు వచ్చి వెళ్లిన మూడు రోజులకే ఎమ్మెల్యే రాములునాయక్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటన్న దానిపై చర్చ నడుస్తోంది.

  కాంగ్రెస్‌ టికెట్‌ కోసం చివరిదాకా ప్రయత్నించి..

  ఈ మధ్యకాలంలో పీకే సర్వేలో వైరాలో గెలవడం కష్టమని రిపోర్టు వచ్చినట్టు చెబుతున్నారు. దీంతో ఆయనకు తెరాస అధినేత టికెట్‌ నిరాకరిస్తారని.. ఇప్పటి నుంచే కాంగ్రెస్‌ నేతలకు టచ్‌లో ఉంటే బెటరన్నవిధంగా ఎమ్మెల్యే ఈ కామెంట్లు చేశారా.. ? అన్న డౌటు కొడుతోందని తెరాస నేతలే అంటున్నారు. నిజానికి గత ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్‌ టికెట్‌ కోసం చివరిదాకా ప్రయత్నించి.. చివరలో నిరాశకు గురై, ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలిచారు.

  ఆయనకు తెరాసలోనే ఓ వర్గం సపోర్ట్‌ చేసిందన్న చర్చ ఇక్కడ అప్రస్తుతం అయినప్పటికీ, పార్టీలతో పనిలేకుండా గెలిచిన తనకు ఒక పార్టీ టికెట్‌ ఇవ్వడం లేదా నిరాకరించడం అనేది ఒక పెద్ద విషయం కాదన్నట్టు ఎమ్మెల్యే రాములు నాయక్‌ వ్యవహరించడం ఇక్కడ విశేషం. మొత్తానికి అధికార తెరాస నుంచే పోటీలో ఉంటారా.. లేక సర్వే రిపోర్టులు అంటూ జరుగుతున్న ప్రచారం ప్రకారం టికెట్‌ దక్కకుంటే మరే పార్టీ నుంచి అయినా పోటీలో ఉంటారా..? చూడాల్సి ఉంది. మొత్తానికి మళ్లీ నేనే ఎమ్మెల్యేను అంటూ ఆయన చేసిన కామెంట్స్‌ మాత్రం హల్‌చల్‌ చేస్తున్నాయి.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Khammam, Telangana Politics, Trs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు