తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల సారథ్యంలోని వైఎస్ఆర్‌టీపీ ప్రభావం చూపుతుందనే నమ్మకం ఎవరిలోనూ పెద్దగా లేవనే చెప్పాలి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సాగుతున్న పోటీలో ఇతర పార్టీలు తమ ప్రభావం చూపలేకపోతున్నాయి. ఈ జాబితాలో వైఎస్ఆర్‌టీపీ కూడా ఉందనే వాదన వినిపిస్తోంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప.. తెలంగాణలో వైఎస్ఆర్‌టీపీ రాజకీయంగా ప్రభావం చూపడం కష్టమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో రాణించాలని శ్రమిస్తున్న వైఎస్ షర్మిల (YS Sharmila) తనదైన వ్యూహంతోనే ముందుకు సాగుతున్నారని మరికొందరు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే షర్మిల పార్టీతో పాటు ఏపీలోని అధికార వైసీపీకి కూడా గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న దివంగత వైఎస్ఆర్ భార్య విజయమ్మ.. వైసీపీలోని తన పదవిని వదులుకున్నారు. వైసీపీ ప్లీనరీలోనే ఆమె విషయాన్ని ప్రకటించారు. అధికారికంగా ఆ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణలోని వైఎస్ఆర్‌టీపీకి సహకరించాలని నిర్ణయించుకున్నారు. దీంతో తెలంగాణలో విజయమ్మ (YS Vijayamma) తన కూతురు షర్మిల రాజకీయ భవిష్యత్తు మెరుగుపడేందుకు ఏ విధమైన చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే విజయమ్మ వైఎస్ఆర్‌టీపీకి (YSRTP) అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో వైసీపీకి రాజీనామా చేసినా.. కొన్ని నెలల నుంచి ఆమె అదే పనిలో ఉన్నారనే చర్చ జరుగుతోంది.
షర్మిల పార్టీ పెట్టినప్పటి నుంచి విజయమ్మ ఆమె వెంటే ఉన్నారు. ఒకసారి షర్మిల పార్టీకి మద్దతు పలకాలని.. ఆమెకు తెలంగాణలో రాజకీయంగా అండగా ఉండాలని కోరుతూ వైఎస్ఆర్‌కు అండగా ఉన్న వారిని పిలిచి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణకు చెందిన అనేక మంది నేతలు హాజరయ్యారు. అయితే వారిలో ఎవరూ తెలంగాణలో వైఎస్ షర్మిలతో కలిసి పని చేసేందుకు ముందుకురాలేదు. ఈ విధంగా విజయమ్మ చేసిన ప్రయత్నం ఫలించలేదని అప్పట్లోనే వాదనలు వినిపించాయి.
YS Vijayamma: విజయమ్మ రాజీనామా వైసీపీకీ నష్టమేనా..? పార్టీలో ఆమె పోషించిన పాత్ర ఇదే
YS Bharati: విజయమ్మ రాజీనామాతో వైసీపీలో కొత్త చర్చ.. వైఎస్ భారతి రాజకీయాల్లోకి రానున్నారా ?
ఇక తెలంగాణలో షర్మిల పాదయాత్ర చేస్తున్నప్పటికీ.. ఆ పార్టీకి నేతల నుంచి పెద్దగా మద్దతు లభించడం లేదని.. ఆమె పార్టీలోకి ఇతర పార్టీల నుంచి చేరికలు లేవని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే తాజాగా విజయమ్మ వైసీపీలోని పదవికి రాజీనామా చేయడంతో.. ఇక పూర్తిస్థాయిలో వైఎస్ఆర్‌టీపిపై ఫోకస్ చేసే అవకాశం ఉందని.. ఇందుకోసం ఆమె మళ్లీ ఆత్మీయ సమావేశం తరహాలో మీటింగ్‌లు ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. మొత్తానికి రాజకీయంగా వైసీపీకి పూర్తిగా దూరమైన విజయమ్మ.. తన కూతురు పార్టీలో మరింత క్రియాశీలక పాత్ర పోషిస్తారా ? వైఎస్ఆర్‌టీపీకి తెలంగాణలో మైలేజీ వచ్చేలా చేస్తారా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana, YS Sharmila, YS Vijayamma, Ysrtp