Home /News /telangana /

TS POLITICS WILL TELANGANA CM KCR TAKE FINAL CALL ON MUNUGODU CANDIDATE IN TOMORROW MEETING AK

KCR| Munugodu: కేసీఆర్ రేపు తేల్చేస్తారా ? ఇంకా సమయం తీసుకుంటారా ?.. టీఆర్ఎస్‌లో ఉత్కంఠ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

KCR| Munugodu: బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉండటం ఖాయం కాగా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ తరపున ఇక్కడి నుంచి పోటీ చేయబోయేది ఎవరనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు మునుగోడులో జరగబోయే సభకు హాజరుకానున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఈ సభను మొదటి మెట్టు కావాలని ఆయన భావిస్తున్నారు. మునుగోడులో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారు ? ఎవరికి టార్గెట్ చేస్తారు ? ఎలాంటి కొత్త రాజకీయ అస్త్రాలు సంధిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ బీజేపీకి కచ్చితంగా చెక్ పెట్టాలనే ఆలోచనతో ఉన్న కేసీఆర్.. ఇందుకోసం తనదైన వ్యూహాలను సిద్ధం చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదిలా ఉంటే మునుగోడులో టీఆర్ఎస్ తరపున పోటీ చేసే అవకాశం ఎవరికి దక్కుతుందనే దానిపై చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది. బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉండటం ఖాయం కాగా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ తరపున ఇక్కడి నుంచి పోటీ చేయబోయేది ఎవరనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

    కాంగ్రెస్‌లో మునుగోడు అభ్యర్థి గురించి తీవ్రమైన కసరత్తు జరుగుతుండగా.. టీఆర్ఎస్‌లోనూ మునుగోడు అభ్యర్థి ఎంపిక గతానికి భిన్నంగా కొంత క్లిష్టంగా మారిందనే వాదన వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని స్థానిక ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేయగా.. అభ్యర్థి ఎవరనే అంశాన్ని పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం పని చేయాలని నేతలకు టీఆర్ఎస్ నాయకత్వం స్పష్టం చేసింది.

    అయితే రేపటి సభలోనే మునుగోడు నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేయబోయేది ఎవరనే అంశంపై కేసీఆర్ స్పష్టత ఇస్తారని.. సభా వేదికగానే అభ్యర్థి పేరును ప్రకటిస్తారని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మునుగోడులోనే అభ్యర్థిని ప్రకటించడం ద్వారా సమరశంఖం పూరించినట్టు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపే టీఆర్ఎస్ నాయకత్వం మొగ్గు చూపుతుందనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.

    అదే సమయంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇచ్చే విషయంలో సీఎం కేసీఆర్ ఇంత తొందరగా నిర్ణయం తీసుకుంటారా ? లేక మరికొంత సమయం వేచి చూస్తారా ? అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ముందుగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వం విషయంలో అసంతృప్తితో ఉన్న స్థానిక నాయకత్వాన్ని ఒప్పించాల్సిన అవసరం ఉందని.. అందుకే ఇందుకు మరికొంత సమయం తీసుకోవాలని టీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునేది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాబట్టి... ఆయన ఈ విషయంలో రేపే తుది నిర్ణయం తీసుకుని అభ్యర్థి పేరును ప్రకటిస్తారా లేక మరికొంతకాలం వేచి షెడ్యూల్ వచ్చిన తరువాత అభ్యర్థి పేరును ప్రకటిస్తారా ? అన్నది చర్చనీయాంశంగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Munugodu By Election, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు