టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో దోషులను పట్టుకునేందుకు ఏర్పాటైన సిట్(SIT) దూకుడుగా ముందుకు సాగుతోంది. ఓ వైపు దోషులను పట్టుకునేందుకు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్న సిట్.. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలను చేస్తున్న వారికి కూడా నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసుకు సంబంధించి పలు ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని(Revanth reddy) విచారణకు రావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన ఈ రోజు సిట్ విచారణకు హాజరయ్యారు. తన దగ్గర ఉన్న ఆధారాలను అధికారులకు ఇచ్చానని రేవంత్ రెడ్డి ఆ తరువాత చెప్పుకొచ్చారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సిట్ ఖండించింది.
తాను చేసిన ఆరోపణలపై రేవంత్ రెడ్డి ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని సిట్ పేర్కొంది. కేవలం పొలిటికల్ మోటీవ్‌గా మాత్రమే ఆయన సిట్ దర్యాప్తుకు వచ్చారని చెప్పింది.ఈ కేసులో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారని రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ మేరకు ఆయనపై కేసు నమోదుపై న్యాయ సలహాను సిట్ కోరినట్లు తెలుస్తోంది. లీగల్ ఒపీనియన్ ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది.
అయితే రేవంత్ రెడ్డిపై సిట్ కేసు నమోదు చేస్తే.. ఇదే కేసులో నోటీసులు అందుకున్న బండి సంజయ్(Bandi Sanjay) పరిస్థితి ఏంటనే దానిపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆధారాలు ఇవ్వలేదనే కారణంతో రేవంత్ రెడ్డిపై సిట్ కేసు నమోదు చేస్తే.. బండి సంజయ్ విషయంలోనూ ఇదే రకంగా ముందుకు వెళతారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. రేవంత్ రెడ్డి తరహాలోనే ఈ విషయంలో ఆరోపణలు చేసినందుకు సిట్ బండి సంజయ్‌కు నోటీసులు ఇచ్చింది.
TS Tenth Exams 2023: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి ఎగ్జామ్స్ ఇలా.. విద్యాశాఖ కీలక ఆదేశాలు
ఈ నెల 24న విచారణకు హాజరై.. తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ ఈ కేసులో రాజకీయ ఆరోపణలు చేయడంతో.. ఒకరిపై చర్యలు తీసుకుంటే.. మరొకరిపై కూడా అదే రకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే.. ఈ కేసు రాజకీయ మలుపులు తిరిగే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Revanth Reddy, Telangana