TS POLITICS WILL PJR LEGACY WAR BETWEEN VISHNUVARDHAN REDDY AND VIJAYAREDDY WILL BECOME A NEW HEADACHE FOR CONGRESS OF TELANGANA AK
Congress: పీజేఆర్ వారసత్వంపై వార్.. కాంగ్రెస్‌కు కొత్త ఇబ్బందులు తీసుకొస్తుందా ?
విజయారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి (ఫైల్ ఫోటో)
విజయారెడ్డికి కాంగ్రెస్ తరపున ఖైరతాబాద్ టికెట్ ఇస్తారనే ప్రచారం జరగడంతోనే విష్ణువర్ధన్ రెడ్డి యాక్టివ్ అయ్యారని.. అక్కకు సీటు రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
రాజకీయాల్లో వారసత్వానికి బాగానే ప్రాధాన్యత ఉంటుంది. అందులోనూ ప్రముఖ నేతల వారసులు వారి పెద్దల పేర్లతోనే ఎక్కువగా ప్రజల్లోకి వెళుతుంటారు. దివంగత కాంగ్రెస్ నేత పీజేఆర్‌గా అభిమానులు పిలుచుకునే పి.జనార్ధన్ రెడ్డి వారసులు కూడా ఆయన పేరు చెప్పుకునే రాజకీయాల్లో రాణిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన వారసుల మధ్య రాజకీయ వారసత్వం కోసం వార్ మొదలైందనే చర్చ జరుగుతోంది. పీజేఆర్ చనిపోయిన తరువాత ఆయన కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ తరపున రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత రెండుసార్లు ఓటమి చవిచూశారు. అయితే పీజేఆర్ స్థాయిలో ఆయన రాజకీయాల్లో ప్రభావం చూపలేకపోతున్నారు. ఇక పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా రాజకీయాల్లోకి వచ్చారు. టీఆర్ఎస్ తరపున కార్పొరేటర్‌గా ఉన్న ఆమె ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరారు.
ఎమ్మెల్యేగా పోటీ గెలవాలనేది విజయారెడ్డి కల. టీఆర్ఎస్లో ఆ అవకాశం వచ్చే ఛాన్స్ లేదని గ్రహించిన విజయారెడ్డి.. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్‌లో పీజేఆర్ వారసత్వం కోసం వార్ మొదలైందనే చర్చ జరుగుతోంది. విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరిన కార్యక్రమానికి ఆమె తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి దూరంగా ఉన్నారు. ఆ మాటకొస్తే వీరిద్దరి మధ్య పెద్దగా సత్సంబంధాలు లేవనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఇక అప్పటివరకు రాజకీయంగా సైలెంట్‌గా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి.. విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరిన తరువాత యాక్టివ్ అయ్యారు. ఆయన ఇంట్లో ఇటీవల లంచ్ మీటింగ్ కూడా జరిగింది.
ఉన్నట్టుండి విష్ణువర్ధన్ రెడ్డి యాక్టివ్ కావడంపై రాజకీయవర్గాల్లో కొత్త చర్చ జరుగుతోంది. విజయారెడ్డికి కాంగ్రెస్ తరపున ఖైరతాబాద్ టికెట్ ఇస్తారనే ప్రచారం జరగడంతోనే విష్ణువర్ధన్ రెడ్డి యాక్టివ్ అయ్యారని.. అక్కకు సీటు రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇటీవల ఒక కుటుంబం నుంచి ఒక్కరికే టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఆ లెక్కన విజయారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిల్లో ఎవరో ఒకరికే టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందని.. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విజయారెడ్డికే ఈసారి కాంగ్రెస్ తరపున టికెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు చర్చించుకుంటున్నారు.
ఈ కారణంగానే విష్ణువర్ధన్ రెడ్డి యాక్టివ్ అయ్యారని.. వరుస సమావేశాల ద్వారా ఆయన కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి పీజేఆర్ వారసత్వం కోసం మొదలైన వార్ ప్రభావం.. కాంగ్రెస్ పార్టీపై ఏ రకంగా ప్రభావం చూపుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.