నేడు కొండగట్టులో ఆంజనేయస్వామిని దర్శించుకుని తన వారాహి వాహనానికి పూజలు నిర్వహించిన అనంతరం జగిత్యాల జిల్లా నాచుపల్లిలో జనసేన తెలంగాణ కార్యకవర్గంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కనీసం పది మంది అయినా తెలంగాణ అసెంబ్లీలో జనసేన(Janasena) ఎమ్మెల్యేలు ఉండాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. తెలంగాణలో(Telangana) తాము పరిమితస్థాయిలోనే పోటీ చేస్తామని వెల్లడించారు. 7 నుంచి 14 స్థానాల్లో పోటీ చేసినా, బలంగా పోటీ చేద్దామని అన్నారు. నేతలు ఎక్కడ పోటీ చేద్దామంటే అక్కడ పోటీ చేద్దామని వ్యాఖ్యానించారు. తాను ప్రతి నియోజకవర్గంలో తిరుగుతానని పవన్ పేర్కొన్నారు. తెలంగాణలో తమతో ఎవరైనా పొత్తుకు వస్తే స్వాగతిస్తామని తెలిపారు. మంచి భావజాలం ఉన్న పార్టీలతోనే జనసేన పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో పరిమితులతో కూడిన ఆట ఆడుతున్నానని అన్నారు.
అయితే పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేసే అంశంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఏపీలో జనసేన బీజేపీకి రాజకీయ మిత్రుడిగా ఉంది. అయితే ఈ స్నేహం కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ ఏపీలో బీజేపీ , జనసేన మధ్య రాజకీయ బంధం తెగిపోతే.. తెలంగాణలో కూడా జనసేన బీజేపీకి వ్యతిరేకంగానే బరిలోకి ఉండే అవకాశం ఉంది.
ఇక ఏపీలో జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో చర్చలు పూర్తయ్యాయనే ఊహాగానాలు కూడా ఏపీ రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒకవేళ ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే.. ఆ రాజకీయ స్నేహం తెలంగాణలోనూ కొనసాగే అవకాశం ఉంటుంది.
CM Kcr-New Secretariat: కొత్త సచివాలయం నిర్మాణం పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
Ys Sharmila: పాదయాత్రపై వైఎస్ షర్మిల కీలక ప్రకటన..తిరిగి అక్కడే మొదలు...
తెలంగాణలో మళ్లీ టీడీపీని బలోపేతం చేయడానికి చంద్రబాబు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం కొద్ది రోజుల క్రితం ఖమ్మంలో సభ ఏర్పాటు చేశారు. టీటీడీపీకి కొత్త అధ్యక్షుడిని కూడా నియమించారు. పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని వారిని ఆదేశించారు. తెలంగాణలో టీడీపీ, జనసేన జట్టుగా బరిలోకి దిగితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతో కొంత చీలిపోయే అవకాశం ఉంది. అది అంతిమంగా అధికార టీఆర్ఎస్కు మేలు చేయడంతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న బీజేపీకి షాక్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని పలువురు విశ్లేషిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.