తెలంగాణలో అందరి దృష్టిని ఆకర్షించిన మునుగోడు(Munugodu) ఉప ఎన్నిక పూర్తయ్యింది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగిన ఈ ఉప పోరులో చివరకు విజయం టీఆర్ఎస్నే వరించింది. ఇక ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయినప్పటికీ.. డబ్బు, మద్యం ప్రభావం ఎక్కువగా కనిపించిన ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 23 వేలకు పైగా ఓట్లు సాధించడం కాంగ్రెస్ పార్టీకి ఊరట కలిగిస్తోంది. నిజానికి ఇంత హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో ఓట్లు సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. అయితే ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి(Palvai Sravanti) మాత్రం ఈ ఉప ఎన్నికల్లో తన ప్రభావం చూపించగలిగారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో కోవర్టు రాజకీయాల కారణంగానే తాను ఓడిపోయానని ఆమె కామెంట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పరోక్షంగా పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని (Komatireddy Venkat Reddy) ఆమె టార్గెట్ చేశారు. ఈ విషయంపై అధిష్టానం సీరియస్‌గానే ఫోకస్ చేసిందని ఆమె చెప్పడం ఆసక్తిరేపుతోంది. ఇప్పటికే తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెన్ నేతను వెంకట్ రెడ్డి కోరినట్టు వచ్చిన వీడియోపై కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రెండుసార్లు ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై ఆయన వివరణ కూడా ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే కొంతకాలంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరుపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది.
తాజాగా ఆ పార్టీ జాతీయ నేతల్లో ఒకరైన జైరామ్ రమేశ్ ఇదే రకమైన సంకేతాలు ఇచ్చారు. పార్టీ వ్యతిరేకంగా పని చేసిన వారిపై చర్యలు తీసుకునే అంశాన్ని హైకమాండ్ చూసుకుంటుందని పరోక్షంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారాన్ని ఉద్దేశించి అన్నారు. అయితే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ బార్డర్ దాటిన వెంటనే.. కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి పంచాయతీ మొదలవుతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
Munugode Bypoll Result: మునుగోడులో టీఆర్ఎస్ గెలవ లేదు .. గెలిచిన వాళ్ల పేర్లు చెప్పిన బండి సంజయ్
BJP in Munugode : మునుగోడు ఉప ఎన్నికలో ఓడినా బీజేపీకి భారీ లాభం
అయితే హుజూరాబాద్ ఫలితానికి భిన్నంగా ఇక్కడ కాంగ్రెస్ సాధించిన ఫలితాలు ఉండటం.. పార్టీకి వ్యతిరేకంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పని చేసినట్టు ఆధారాలు ఉండటంతో.. ఆయనపై చర్యలు తీసుకోవడంపై కొందరు కాంగ్రెస్ నేతలు పట్టుబట్టే అవకాశం ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తానికి రాహుల్ గాంధీ యాత్ర తెలంగాణ బార్డర్ దాటిన వెంటనే.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త పంచాయతీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.