తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ఇతర రాష్ట్రాల్లోని నేతలతో సమావేశమయ్యే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈసారి ఆయన అజెండా ఏమిటన్నది బయటపెట్టడం లేదు. అయితే మరికొన్ని నెలల్లో జరగబోయే రాష్ట్రపతి(Rashtrapati) ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనే ఆయన ఇతర పార్టీల నేతలతో చర్చించబోతున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. దేశ తదుపరి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కసరత్తు కొనసాగుతోంది. ఈ అంశంలో ప్రధాని మోదీ,(PM modi) అమిత్ షా మనసులో ఎవరున్నారనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈసారి ఏ వర్గానికి చెందిన వారికి రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వబోతున్నారు ? రాష్ట్రపతి పదవిని దక్షిణాదికి చెందిన నేతకు ఇస్తారా ? అన్న అంశాలపై కూడా చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంలో బీజేపీని ఇరుకుపెట్టే విధంగా పలు ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఓ అభ్యర్థిని నిలబెట్టాలనే యోచనలో సీఎం కేసీఆర్(CM KCR) ఉన్నారని.. ఈ అంశంపైనే ఆయన ఇతర పార్టీల నేతలతో చర్చిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. నిజానికి రాష్ట్రపతి అభ్యర్థిని బరిలోకి దింపే విషయంలో బీజేపీ, కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఆ పార్టీకి మద్దతుగా నిలిచే పార్టీలు.. ఈ విషయంలోనూ వారిని అండగా ఉంటుంటాయి.
కానీ ఈసారి కాంగ్రెస్ సొంతంగా అభ్యర్థిని బరిలోకి దింపే పరిస్థితిలో లేదని.. ఒకవేళ దింపినా.. వారి అభ్యర్థికి ఇతర పార్టీలు అంత ఈజీగా మద్దతు ఇచ్చే అవకాశాలు లేవు అనే చర్చ జోరుగా సాగుతోంది. అందుకే దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఓ అభ్యర్థిని బరిలోకి దింపడం వల్ల.. ఆ పార్టీకి తాము అంతా వ్యతిరేకంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందని కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు. ఒకవేళ ఈ విషయంలో కాంగ్రెస్ తమతో కలిసి వస్తే.. వారిని కూడా వెంట తీసుకెళ్లాలని కేసీఆర్ తాను కలిసి నేతలకు చెప్పినట్టు సమాచారం.
అయితే బీజేపీని ఇరుకునపెట్టేందుకు కేసీఆర్ అనుసరిస్తున్న ఈ వ్యూహం కారణంగా కాంగ్రెస్ కూడా ఇరుకునపడే అవకాశం లేకపోలేదనే వాదన వినిపిస్తోంది. కేసీఆర్తో కలిసి పని చేసే అవకాశం లేదని స్పష్టంగా ప్రకటించిన కాంగ్రెస్.. జాతీయస్థాయిలో ఆయన కీలకంగా వ్యవహరించే రాజకీయ ప్రక్రియలో భాగస్వామి అవుతుందా ? ఒకవేళ అలా జరిగితే కాంగ్రెస్కు నష్టం కలుగుతుందనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి బీజేపీని ఇరుకునపెట్టేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్న కొత్త వ్యూహం.. కాంగ్రెస్కు కూడా ఇబ్బందిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.