TS POLITICS WILL CUT MY THROAT SELF IF TRS CM KCR CAME INTO POWER AGAIN CHALLENGES NIZAMABAD BJP MP DHARMAPURI ARAVIND MKS
KCR - TRS మళ్లీ గెలిస్తే గొంతు కోసుకుంటా.. నవంబర్ 20 డెడ్లైన్: BJP ఎంపీ అరవింద్ సంచలన సవాలు
బీజేపీ ఎంపీ అరవింద్ సంచలన సవాలు
తెలంగాణలో కేసీఆర్-టీఆర్ఎస్ మళ్లీ అధికారంలో కొనసాగితే గనుక తాను గొంతు కోసుకుంటానని బీజేపీ ఎంపీ అరవింద్ సవాలు చేశారు. రాష్ట్రంలో కొనసాగుతోన్న టీఆర్ఎస్ అరాచకాలకు మంత్రి కేటీఆర్ బాధ్యుడని ఆరోపించారు. వివరాలివే..
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండబోవని సీఎం కేసీఆర్ చెప్పినప్పటికీ, రాజకీయ వాతావరణం మాత్రం పూర్తిగా ఆ దిశలోనే వేడెక్కుతోంది. బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతానని శపథం చేసిన కేసీఆర్ ఆ క్రమంలో కార్యాచరణ అమలు చేస్తుండగా, కేసీఆర్ కుటుంబ అరాచకాలు, అవినీతి అంటూ బీజేపీ ఎదురుదాడి చేస్తున్నది. కేసీఆర్ ను జైలుకు పంపుతామని బండి సంజయ్ అంటే, మోదీని జైల్లో పెడతామని అనలేమా అని కేటీఆర్ పోటాపోటీ ప్రకటనలు చేస్తున్నారు. వీటన్నిటి మధ్య నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పటిదాకా ఏ కాషాయనేతా చేయనటువంటి సంచలన ఛాలెంజ్ కు సిద్దమయ్యారు. తెలంగాణలో కేసీఆర్-టీఆర్ఎస్ మళ్లీ అధికారంలో కొనసాగితే గనుక తాను గొంతు కోసుకుంటానని బీజేపీ ఎంపీ అరవింద్ సవాలు చేశారు..
తెలంగాణ బీజేపీలో సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ గా ఉండే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి తన ప్రతాపం చాటుకున్నారు. మెదక్ జిల్లా రామయంపేటలో ఆత్మహత్య చేసుకున్న తల్లీకొడుకులు (గంగం సంతోష్, పద్మ) కుటుంబాన్ని ఎంపీ శనివారం పరామర్శించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అరాచకాలు పెరిగిపోయాయని..వ్యాపారం చేసుకుంటున్న సంతోష్ కుటంబాన్ని వేధింపులకు గురిచేయడంతోనే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని అరవింద్ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన అనూహ్య సవాలు చేశారు.
తెలంగాణ సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ సోయితప్పి పడుకున్నారని, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతోన్న అన్ని అరాచకాలకు కేసీఆర్ కొడుకు, మంత్రి కేటీఆరే బాధ్యుడని బీజేపీ ఎంపీ అరవింద్ ఆరోపించారు. టీఆర్ఎస్ చిన్నదొర అండతో ఎక్కడికక్కడ గులాబీ నేతలు, వారి ప్రోదర్బలంతో పోలీసులు రెచ్చిపోతూ సామాన్యులను ఇక్కట్లకు గురిచేస్తున్నారని, కామారెడ్డి ఉదంతంపై సీబీఐ ఎంక్వైరీకి సీబీఐ విచారణ జరిపిస్తామని అరవింద్ హామీ ఇచ్చారు. అయితే..
రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా టీఆర్ఎస్ సీబీఐ ఎంక్వైరీకి అడ్డుపడుతుందని, అయితే కేసీఆర్ ఎంతో కాలం సీబీఐని నిలువరించలేరని, వచ్చే ఎన్నికల్లో గనుక టీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే తాను గొంతు కోసుకుంటానని ఎంపీ అరవింద్ ఛాలెంజ్ చేశారు. ‘వచ్చే ఏడాది నవంబర్ 20 తర్వాత ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ గనుక అధికారంలో కొనసాగితే నేను గొంతు కోసుకుంటా. ’అని మీడియా ముఖంగా ఎంపీ అరవింద్ సవాలు విసిరారు. ‘గతంలో కేసీఆర్ దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తానని గొంతు కోసుకోలేదు. టీఆర్ఎస్ కు ఈసారి కుక్క కూడా ఓటేయదు..’అంటూ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కిందున్న (13 నిమిషాల) ఫేస్ బుక్ వీడియోలో (7ని నుంచి 8ని మధ్య) ఎంపీ గొంతుకోత సవాలు వినొచ్చు..
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గతంలోనూ గొంతు కోసుకునే ఛాలెంజీలను పలువురు నేతలు విసరడం, ఆ తర్వాత వెనుకడుగు వేయడం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే సెవెన్ ఓ క్లాక్ బ్లేడుతో గొంతు కోసుకుంటానన్న సినీ నిర్మాత బండ్ల గణేష్.. తర్వాతి కాలంలో కాంగ్రెస్ పార్టీని, రాజకీయాలను వదిలేయడం, గొంతు కోసుకుంటానన్న వ్యాఖ్యలపై క్షమాపణలు కోరడం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు బీజేపీ ఎంపీ అరవింద్ సైతం 2023లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే గొంతు కోసుకుంటానని సవాలు విసిరారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు స్పందించాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.