ఆర్మీ రిక్రూట్మెంట్లో అగ్నిపథ్ పథకం అమలుపై శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ అల్లర్ల వెనుక పీకే ఉన్నాడని బీజేపీ నాయకురాలు డీకే అరుణ సంచలన ఆరోపణలు వ్యక్తం చేసి కీలక చర్చకు తెరలేపారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) రణ రంగమైంది. అగ్నిపథ్ ఆర్మీ నియామకాలను (AgnipathRecruitmentScheme )వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు స్టేషన్‌ను ముట్టడించారు. స్టేషన్‌లోని ఫర్నిచర్, షాపులను ధ్వంసం చేశారు. పట్టాలపై ఆగి ఉన్న మూడు రైళ్లకు నిప్పుపెట్టారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. రాళ్లు దాడులు చేశారు. ఈ క్రమంలోనే రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. గాల్లోకి 15 రౌండ్ల కాల్పులు జరపడంతో కొన్ని బుల్లెట్స్ ఆందోళనకారులను తగిలినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా.. కాసేపటికే మృతి చెందాడు. మరికొందరు నిరసనకారులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మీరంటే మీరంటూ..
అయితే ఈ అగ్నిపథ్ ఆందోళనలు ఉత్తర భారతదేశంలో మొదలై అనూహ్యంగా తెలంగాణ (Telangana) గడ్డపైకి పాకడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో శుక్రవారం నాటి విధ్వంస కాండ వెనుక అసలు కారకులు ఎవరు అనేది ప్రధాన చర్చగా మారింది. ఈ అంశంలో రాజకీయ పార్టీలు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. కాంగ్రెస్ (Congress), టీఆర్ఎస్ (TRS), ఎంఐఎం (MIM)లే ఈ విధ్వంసానికి కారణం అని భారతీయ జనతా పార్టీ (BJP) ఆరోపిస్తుంటే.. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తోడు దొంగలని ఇదంతా వారి కుట్రే అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
పీకే ఉన్నాడనే అనుమానం..?
ఈ అల్లర్ల వెనుక పీకే ఉన్నాడని బీజేపీ నాయకురాలు డీకే అరుణ (Telangana BJP leader DK Aruna) సంచలన ఆరోపణలు వ్యక్తం చేసి కీలక చర్చకు దారితీశారు. నిన్నటి ఘటన ముమ్మాటికి ముందస్తు వ్యూహంలో భాగంగానే జరిగిందని తెలుస్తోందని డీకే అరుణ అభిప్రాయ పడ్డారు. కుట్ర వెనుక టీఆర్ఎస్ రాజకీయ వ్యూహకర్త అని చెప్పుకుంటున్న ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) కు సంబంధం ఉండవచ్చని ఆమె అనుమాన పడ్డారు. ఈ విషయంలో నిజానిజాలేంటో తేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. లేకుంటే తాము కేంద్ర ప్రభుత్వాన్ని విచారణకు కోరుతామని హెచ్చరించారు. ఇంతటి విధ్వంసానికి రచన జరుగుతుంటే నిఘా విభాగం ఏం చేస్తోందని ప్రశ్నించారు డీకే అరుణ. మరోవైపు బీజేపీ చీఫ్ బండి సంజయ్కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యమని, దాడులకు అభ్యర్థులు కారణం కాకపోవచ్చని రాజకీయ శక్తులు ఉన్నాయని ఆరోపించారు.
మంత్రి హరీశ్ కౌంటర్..
అయితే డీకే అరుణ, బండి సంజయ్ ఆరోపణలపై మంత్రి హరీశ్ కౌంటర్ ఇచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad railway station) దాడుల వెనక ఇక్కడ టీఆర్‌ఎస్ హస్తం ఉంటే మరి ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అల్లర్ల వెనుక ఎవరున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. యువకుల బాధ కేంద్రానికి అర్థంకావడం లేదని విమర్శించారు. బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ మాటలు తీయగా, చేతలు చేదుగా ఉన్నాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రజావ్యవతిరేక నిర్ణయాలతో ప్రతి ఒక్కరి ఉసురు పోసుకుంటున్ననది చెప్పారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.