తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మునుగోడు బైపోల్ (Munugodu By Election) అత్యంత ఖరీదైనదిగా మారింది. నెల రోజుల పాటు ఉత్కంఠగా మారిన మునుగోడు ఉపఎన్నిక (Munugodu By Election) ఇప్పుడు తుదిఘట్టానికి చేరుకుంది. మరో 24 గంటల్లో మునుగోడు (Munugodu) ఎవరిదో తెలిసిపోనుంది. మునుగోడు (Munugodu చరిత్రలోనే అత్యధికంగా 93.13 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక ఎన్నికల ఫలితాలు ఈవీఎంలో సంక్షిప్తం అయి ఉండగా..వాటిని నల్గొండ జిల్లాలోని ఆర్జాలబావి వద్ద ఓ గోడౌన్ లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా 9 గంటల వరకు తొలి ఫలితం వెలువడనుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మరి కౌంటింగ్ ఎన్ని రౌండ్లలో జరగనుంది? ఒక్క రౌండ్ లో ఎన్ని పోలింగ్ స్టేషన్ల ఓట్లను లెక్కిస్తారు. మొదట ఏ మండల ఓట్లను లెక్కిస్తారు వంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ ఏజెంట్ లు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ను ఓపెన్ చేస్తారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. నియోజకవర్గంలో మొత్తంగా 686 పోస్టల్ ఓట్లు పోలైనట్లు తెలుస్తుంది. ఇవి లెక్కించిన తరువాత ఈవీఎంలలో ఉన్న ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 15 రౌండ్లుగా 21 టేబుళ్లలో కౌంటింగ్ కొనసాగనుంది. ఒక్కో రౌండ్ లో 21 పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో టేబుల్ కు కౌంటింగ్ సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. 15 రౌండ్లలో 298 పోలింగ్ కేంద్రాల ఓట్లను లెక్కించనున్నారు. 15 రౌండ్లుగా 21 టేబుళ్లలో కౌంటింగ్ జరగనుండగా ఒక్కో రౌండ్ లో 21 పోలింగ్ స్టేషన్ల ఓట్లను లెక్కించనున్నారు. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లకు మూడు దఫాలుగా శిక్షనిచ్చారు. జిల్లా ఎన్నికలాధికారి వినయ్ కృష్ణా, ఆర్వో రోహిత్ సింగ్, కేంద్రం నుండి వచ్చిన ముగ్గురు పర్యవేక్షకుల ఆధ్వర్యంలో కౌంటింగ్ జరగనుంది. స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడంచెల భద్రత కల్పించారు. సీసీ కెమెరాల నిఘా, కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా పార్టీల నుండి 21 మంది కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకునేలా అధికారులు అనుమతి ఇచ్చారు.
కాగా మొదటగా చోటుప్పల్ మండలం ఓట్లను లెక్కించనున్నారు అధికారులు. ఆ తరువాత నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్లను లెక్కించనున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంట తరువాత పూర్తి ఫలితం వెలువడే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Munugodu, Munugodu By Election, Results, Telangana