ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులను బీజేపీలోకి చేర్చుకోవాలని.. కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలనే ఆలోచన తమకు ఏ మాత్రం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సానుభూతి కోసం టీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందని ఆయన విమర్శించారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్,(MP Dharmapuri Arvind) ఆయన తల్లిని మంత్రి పరామర్శించారు. కావాలనే టీఆర్ఎస్ పార్టీ తన ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేర్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ నిరాశతోనే తమపై దాడులకు తెగబడుతోందని కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆరోపించారు.తమకు అసలు అవసరమే లేదని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన కూడా లేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కవితను బీజేపీలోకి చేరాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నామని కేసీఆర్ వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుబట్టారు. బీజేపీకి తెలంగాణ సమాజం అండగా వుంటుందని కిషన్ రెడ్డి అన్నారు. తమ పార్టీ సిద్ధాంతాలు, నరేంద్రమోదీ నాయకత్వంపై విశ్వాసం వున్న వారినే బీజేపీలోకి చేర్చకుంటామని స్పష్టం చేశారు.
పలు పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను టీఆర్ఎస్లో చేర్చుకున్న కేసీఆర్ .. వారితో రాజీనామా కూడా చేయించలేదని కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భయపెట్టి పార్టీలో చేర్చుకునే సంస్కృతి బీజేపీకి లేదని చెప్పారు. అలాంటి కేసీఆర్ పార్టీ ఫిరాయింపుల గురించి నైతిక విలువల గురించి వీడియోలు చేసి దేశవ్యాప్తంగా పంపిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై మొట్టమొదటి కేసు పెట్టాలంటే కేసీఆర్ మీదనే పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
అంతకుముందు కవిత,(Kavitha) ధర్మపురి అరవింద్ మధ్య మాటల యుద్ధం.. అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడంతో రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనపై ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున మండిపడ్డారు. నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానని హెచ్చరించారు. తెలంగాణ సమస్యలపై పార్లమెంట్లో అర్వింద్ ప్రశ్నించిన పాపాన పోలేదన్నారు. బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేశాడని రైతులు ఆరోపిస్తున్నారన్నారు. బాండ్‌పేపర్ రాసిచ్చిన అర్వింద్‌పై.. ఫిర్యాదు చేస్తామని రైతులు అంటున్నారన్నారు. అర్వింద్‌పై పోటీ చేసిన అభ్యర్థిగా తానే ఆయనపై ఫిర్యాదు చేస్తానని కవిత అన్నారు. తాను కాంగ్రెస్‌లోకి వెళ్తానని అసత్యాలు ప్రచారం చేశారని ఆరోపించారు.
Supreme Court: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు..సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..ఆ పిటిషన్ తిరస్కరణ
అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఇంటి ఆవరణలో ఉన్న పూల కుండీలను ధ్వంసం చేయడమే కాకుండా.. అరవింద్ దిష్టిబొమ్మను కూడా దహనం చేశాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కార్యకర్తలను అడ్డుకుని పరువురిని అరెస్ట్ చేశారు. దాంతో అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దాడి విషయం తెలుసుకున్న ఎంపీ అర్వింద్.. కవిత, టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. తాను చేసిన విమర్శలకు అంతగా స్పందించారంటే.. అందులో నిజం ఉన్నట్టు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Kishan Reddy, Telangana