తెలంగాణ(Telangana)లో పట్టుకోసం ప్రయత్నిస్తున్న బీజేపీ(BJP) ..రాష్ట్ర అధికార పార్టీ నేతలను కుటుంబ పాలన పేరుతో విమర్శిస్తుంటే ..గులాబీ పార్టీ నాయకులు కూడా అంతే ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. ప్రత్యక్షంగా తెలంగాణ బీజేపీ నేతలతో పాటు పరోక్షంగా బీజేపీ అగ్రస్థాయి నేతకు చురకలు అంటించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(TRS Working President), ఐటీశాఖ మంత్రి కేటీఆర్(KTR).డిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములు ఎవరో .. ఢిల్లీ(Delhi)నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుడు ఎవరో తెలంగాణ రాష్ట్రం గమనిస్తోందని ఆదివారం కేంద్రమంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటనలో కనిపించిన ఓ వీడియో ట్యాగ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో(Video)నే సోషల్ మీడియా(Social media)లో విస్తృతంగా వైరల్ అవుతోంది.
మీరు గుజరాతీలకు గులాం చేస్తున్నారు..
తెలంగాణ ప్రజానికాన్ని కేసీఆర్ అన్నీ విధాలుగా మోసం చేశారని.. కేవలం తన కుటుంబ సభ్యులకు మాత్రమే పదవులు ఇప్పించుకొని రాజ్యాధికారం చలాయిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.ఆదివారం మునుగోడులో నిర్వహించిన బీజేపీ సమరభేరి బహిరంగసభకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మరోసారి ప్రయత్నించారు. హైదరాబాద్ చేరుకున్న అమిత్‌షా ముందుగా సికింద్రాబాద్‌లోని ఉజ్జాయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారి ఆలయంలో పూజలు చేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పులను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వయంగా మోసుకెళ్లి కాళ్లకు తొడుగుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈవీడియో ఆధారంగానే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణ బీజేపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది.
ఢిల్లీ "చెప్పులు" మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని - తెలంగాణ రాష్ట్రం గమనిస్తున్నది.
తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నది.
జై తెలంగాణ! https://t.co/SpFCHAszYe
— KTR (@KTRTRS) August 22, 2022
మేం చుక్కలు చూపిస్తుంటే ..
ఢిల్లీ "చెప్పులు" మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని - తెలంగాణ రాష్ట్రం గమనిస్తోందటూ అటు బండి సంజయ్‌ని ఉద్దేశిస్తూ కామెంట్స్ పోస్ట్ చేశారు. అలాగే ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుడు అంటూ కేసీఆర్‌ని ఉదాహరణగా చూపిస్తూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు కేటీఆర్.
వీడియోతో దొరికిపోయిన బండి..
దీనిపై నెటిజన్లు, టీఆర్ఎస్ మద్దతుదారులు ఘాటుగా స్పందిస్తున్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పికొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నదంటూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు. చెప్పులు మోస్తున్న వీడియోని అడ్డుపెట్టుకొని తెలంగాణ బీజేపీ నేతల్ని ఎండగడుతున్న టీఆర్ఎస్ నేతలకు కాషాయదళం ఎలా తిప్పుకొడుతుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Minister ktr, Telangana Politics