ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam)లో కేసీఆర్(KCR) కుటుంబ సభ్యుల పాత్ర ఉందని జరుగుతున్న ప్రచారాన్ని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ(TRS MLC), సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత (Kalvakuntla kavitha)తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్రంలో అధికారం చూసుకొని బీజేపీ(BJP) సర్కారు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసుకొని ఈవిధంగా కక్షపూరిత రాజకీయాలు చేయడం సరికాదన్నారామె. నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజాస్వామ్య విలువలను బీజేపీ కాలరాస్తోందని మండిపడ్డారు కల్పకుంట్ల కవిత. తెలంగాణ కోసం ఉద్యమించిన తాము ప్రజల పక్షాన పోరాటం చేస్తాం తప్ప వ్యక్తులకు, ఇలాంటి తప్పుడు ప్రచారాలకు భయపడే ప్రసక్తే లేదని మీడియా సాక్షిగా స్పష్టం చేశారు.
అధికార దర్పం చూసుకొని..
కేంద్రంలో అధికారాన్నిచూసుకొని బీజేపీ ప్రతిపక్ష పార్టీలపై కుయుక్తులు, కుట్రలు పన్నుతోందని విమర్శించారు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఢిల్లీలో లిక్కర్ కుంభకోణంలో తన పాత్ర ఉందని జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్సీ కవిత కొట్టిపారేశారు. ఆ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేంద్రంపై పోరాడుతున్న కేసీఆర్‌ని భయపెట్టడానికి బీజేపీ నేతలు ఇలాంటి వ్యర్ధ ప్రయత్నాలు మానుకోవాలని ఆమె హెచ్చరించారు. కేసీఆర్ కూతుర్ని బద్నాం చేస్తే ..తెలంగాణ సీఎం ఆగమైతడనే వ్యర్ద ప్రయత్నాన్ని మానుకోవాలని బీజేపీకి సూచించారు కవిత.
బీజేపీవి వ్యర్ద ప్రయత్నాలు ..
భారతదేశం ఎలా అభివృద్ధి చెందాలనే ఓ కలతో , ప్రత్యేక ఎజెండాతో కేసీఆర్ ముందుకెళ్తున్నారని చెప్పారు కవిత. పార్టీ నాయకులుగా తాము కూడా ఆయన ఎంచుకున్న మార్గంలో ముందుకు వెళ్తాం తప్ప వెనకడుగు వేయబోమన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన సమయంలో తమపై ఎన్నో ఆరోపణలు, కుటుంబ సభ్యులపై చేసిన విమర్శలకు ఏనాడు బెదరలేదన్నారు కవిత. మొక్కవొని ధైర్యంతో, మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న ఘనచరిత్ర మాది అన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.
ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం..
కేంద్రంలో ఉన్న బీజేపీని విపక్షాలు బిల్కిస్ బానో, ఉద్యోగాలు వంటి విషయాలపై ప్రశ్నిస్తున్నందుకే ఈ తరహా కక్షపూరిత దోరణితో వ్యవహరిస్తున్నారని కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈవిషయాలపై జవాబు చెప్పకుండా, ప్రతిపక్షాల మీద ఇలాంటి నిందారోపణలు, బురద చల్లాలనే వైఖరి సరికాదన్నారు. ఇవన్ని ప్రజలు గమనిస్తున్నారని ..వేటికి మేం భయపడే ప్రసక్తి లేదన్నారు కవిత. తనపై, తమ కుటుంబంపై చేసిన ఆరోపణలు ఆరోపణలు గానే మిగిలిపోతాయన్నారామె. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం చేతిలో అన్ని రకాల దర్యాప్తు సంస్థలు, మీడియాను ఉపయోగిస్తోందన్నారు. కాని వాటికి తాము ఎప్పుడూ భయపడమని, వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు. తమపై వచ్చిన ఆరోపణలపై అన్నీ రకాలుగా విచారణ చేసుకోమని బీజేపీకి సవాల్ చేశారు. అందుకు తాము పూర్తిగా సహకరిస్తామని కల్వకుంట్ల కవిత బీజేపీ సర్కారుకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
కుట్ర, కక్ష రాజకీయాలకు భయపడం..
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆప్ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారాన్ని తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్‌కి అంటగట్టారు ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ. కేసీఆర్ కుటుంబానికి చెందిన కొందరువ్యక్తులకు ఈ ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధాలున్నాయన్నారు. అంతే కాదు తెలంగాణకు చెందిన ఓ లిక్కర్ మాఫియా నేత ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఫ్లైట్‌లో ఢిల్లీకి వచ్చిన కేసీఆర్ కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో సెటిల్‌మెంట్ కుదుర్చుకున్నారని విమర్శించారు. ఫస్ట్ ఇన్‌స్టాల్మెంట్‌గా మనీశ్ సిసోడియాకు 150కోట్ల రూపాయలు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు పశ్చిమ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ.
విచారించుకోండి..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో కలిసి ఒబెరాయ్ హోటల్ లోనే పాలసీని రూపొందించారన్నారు బీజేపీ ఎంపీ. ఇదే మద్యం పాలసీ తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాలలోనూ అమలవుతోందని విమర్శించారాయన. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన దగ్గరున్నాయని కేసీఆర్ కుటుంబసభ్యులతో మనీశ్ సిసోడియా మీటింగ్ జరిపారా ? లేదా ? చెప్పాలని పర్వేశ్ డిమాండ్ చేయడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. మరోవైపు టీఆర్ఎస్‌పై బీజేపీ చేస్తున్న నిరాధారమైన ఆరోపణలను తెలంగాణ కాంగ్రెస్ వంతపలుకుతోంది. ఏకవచన పదజాలంతో విమర్శిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ పెడుతున్నారు ఆపార్టీ నేతలు. అయితే ఇలాంటి తప్పుడు ప్రచారాలు, కుట్రపూరితమైన రాజకీయాలకు తాము భయపడే ప్రసక్తి లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈవ్యవహారాన్ని కొట్టిపారేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.