అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన (Rahul gandhi telangana tour) విజయవంతమైందని ఆ పార్టీ వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. వరంగల్ వేదికగా శుక్రవారం నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు కనీసం 2.5లక్షల మంది హాజరైనట్లు నేతులు చెబుతున్నారు. అయితే వరంగల్ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ (Farmer Declaration) ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో రైతు డిక్లరేషన్‌పై అటు బీజేపీ (BJP), ఇటు టీఆర్ఎస్ (TRS) నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి (MLA Jeevan Reddy)కాంగ్రెస్‌ను, రాహుల్ గాంధీలను ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. అసలు వరంగల్ (warangal) కాంగ్రెస్‌ది డిక్లరేషన్ కాదని, ఆ పార్టీ ఫ్రస్ట్రేషన్ అని అన్నారు. ఈ పార్టీ ఇండియన్ నేషనల్ క్లబ్ (Indian National club), పబ్, గబ్బు పార్టీ అని వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి స్టేట్ ఐరన్ లెగ్ (State Iron leg) అయితే రాహుల్ గాంధీ నేషనల్ ఐరన్ లెగ్ అని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ది రైతుల కోసం పోట్లాట కాదని, ఆ పార్టీ నేతల కొట్లాట సభ అని విమర్శించారు. రాచరికపు రాహుల్ గాంధీకి తెలంగాణ గురించి ఏం తెలుసు అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రాహుల్ ఢిల్లీ నివాసి అని, రేవంత్ గల్లీ సన్నాసి అని జీవన్ రెడ్డి విమర్శలు చేశారు. ఈ రెండు ఐరన్ లెగ్‌లు వరంగల్‌లో సొల్లు పురాణం వినిపించారని అన్నారు జీవన్ రెడ్డి.
గ్యారంటీ, వారంటీ లేని పార్టీ..
గల్లీ సన్నాసులు రాసిచ్చిన అబద్ధాల స్క్రిప్ట్ చదివిన రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, మరో 30 ఏళ్లు టీఆర్ఎస్ (TRS) పార్టీనే అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ దేశంలో గ్యారంటీ, వారంటీ లేని పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమేనని జీవన్ రెడ్డి విమర్శించారు. ఎయిర్‌పోర్టులో దిగగానే రాహుల్ గాంధీ ఇక్కడి నేతలు ఏం మాట్లాడాలో సూచనలు ఇచ్చారని ఆరోపించారు.
కాంగ్రెస్ అంటే పెండింగ్ ప్రాజెక్టులు అని, టీఆర్ఎస్ అంటే రన్నింగ్ ప్రాజెక్టులు అని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలో కేసీఆర్ కట్టారని, నెహ్రూ శంకుస్థాపన చేసిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తయిందో చెప్పు అంటూ అడిగారు. ఏళ్లుగా గాంధీలు తెలంగాణకు చేసిందేమీ లేదని, తరతరాలుగా తెలంగాణకు వారే విలన్లు అని జీవన్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ అన్నదాతలకు అండగా రైతు బంధు, టీఆర్ఎస్ ఉండగా కాంగ్రెస్ భరోసా ఎందుకు? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఇంద్రవెల్లిలో వంద మందిని కాల్చి చంపిన కాంగ్రెస్ ఇప్పుడు ఆదివాసీలకు ఏదో చేస్తుందంటే ఎవరు నమ్ముతారని అడిగారు. మద్దతు ధరలు దేశవ్యాప్త నిర్ణయమా? లేక రాష్ట్రానికో పాలసీ ఉంటుందా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Jeevan reddy, Rahul Gandhi, Telangana Politics