తెలంగాణలో రాజకీయాలు (Telangana politics) మరింత వేడెక్కుతున్నాయి. టీఆర్ఎస్ లీడర్లు బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi sanjay) పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ (TRS MLA Balka Suman) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బండి సంజయ్‌ది పాదయాత్ర కాదని పాపాలను కడుక్కునే యాత్ర అంటూ బండి సంజయ్ పై బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. అంతేకాకుండా రాజాకార్ ఫైల్స్ సినిమా తీస్తానన్న బండి సంజయ్‌పై లవంగం ఫైల్స్ (lavangam Files), తంబాకు ఫైల్స్ (Thambaku files) సినిమా తీస్తమని ఎద్దేవా చేశారు. ఇంతకముందు ఉత్తర భారత్దేశంలో కశ్మీర్ ఫైల్స్ సినిమా బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాను గుర్తు చేస్తూ (Telangana Movie politics:) ఇపుడు బండి సంజయ్, బాల్క సుమన్ ఇలా వ్యాఖ్యలు చేశారు.
ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం..
రైతుల కోసం తెలంగాణ (Telangana)లో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని అన్నారు. రైతుల తలసరి ఆదాయం తెలంగాణలో పెరిగిందన్నారు. 24 గంటల పాటు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. మంత్రి వేముల ప్రసంగాన్ని అడ్డుకోవడం సరికాదని సుమన్ అన్నారు. అడ్డుకోవడమే మీ పని అయితే కిషన్ రెడ్డి తెలంగాణలో తిరగలేడంటూ తెలిపారు. ఇలాగే ఆ పార్టీ నడుచుకుంటే బండి సంజయ్ పాదయాత్ర చేయలేడంటూ హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఓర్వలేని తనంతోనే బీజేపీ నేతలు ఇలా చేస్తున్నారని అన్నారు. బీజేపీ నాయకుడిది పాదయాత్ర కాదు.. పాపాలను కడుక్కునే యాత్ర అంటూ విమర్శించారు.
రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఏం ఉద్దరిస్తారు..
రాహుల్ గాంధీ (Rahul gandhi) వరంగల్‌కు వచ్చి రైతులకు ధైర్యం ఇస్తారని టీపీసీసీ రేవంత్ రెడ్డి అంటున్నారని.. సొంత రాష్ట్రంలో ఎమ్మెల్యేలను గెలిపించుకోలేని రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఏం ఉద్దరిస్తారని సుమన్ ప్రశ్నించారు. ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్ పూర్తిగా తుడుచుకుపోతోందని ముందు అక్కడ పార్టీని బాగుచేసుకోవాలన్నారు. తాను రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే కొంత మందికి కోపం వస్తోందని మండిపడ్డారు. రాహుల్ ఓయూకు వచ్చే ముందు అమరవీరులకు క్షమాపణలు చెప్పిరావాలని డిమాండ్ చేశారు.
ప్రైవేటు వ్యక్తులకు దేశ సంపద..
కేసీఆర్ (CM KCR) నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ను అందిస్తున్నదని బాల్క సుమన్ తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. రైతుల కోసం తీసుకువచ్చిన పథకాలతో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని తెలిపారు. దేశ సంపదను బీజేపీ ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా కట్టబెడుతున్నదని ఆరోపించారు. బీజేపీని కమలం పార్టీ అనడం కంటే కార్పొరేట్ పార్టీ అనడం సబబుగా ఉంటుందని ఈ సందర్భంగా బాల్క సుమన్ విమర్శించారు. వలసలు పోయిన జనం మళ్లీ పాలమూరు తిరిగొస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balka Suman, Telangana bjp, Telangana Politics, TRS leaders