TS POLITICS TRS MINISTERS AND MLAS HAVE CRITICIZED UNION MINISTER AMIT SHAH FOR NOT ANSWERING QUESTIONS FROM MINISTER KTR PRV
TRS | Amit shah: కేటీఆర్ ప్రశ్నలకు బదులేది? అమిత్ షా తోక ముడిచారు.. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల ఎద్దేవా
కేటీఆర్, అమిత్ షా (ఫైల్)
ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణలో కేసీఆర్‌ను బండి సంజయ్ ఒక్కడే కూల్చేయగలడని అమిత్‌షా అన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అమిత్‌షాపై విమర్శలు గుప్పించారు.
బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో జరిగిన విషయం తెలిసిందే. ఈ సభలో ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) పాల్గొన్నారు. తెలంగాణలో నయా నిజాంను గద్దె దింపుదామా? వద్దా? అయితే మీరంతా పిడికిలి బిగించి నాతో ‘భారత్ మాతాకీ జై’ నినాదం చేయండి.. అంటూ పార్టీ కార్యకర్తల్లో షా ఉత్సాహం నింపారు. తెలంగాణలో కేసీఆర్‌ను బండి సంజయ్ ఒక్కడే కూల్చేయగలడని అమిత్‌షా అన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు (TRS ministers and MLAs) అమిత్‌షాపై విమర్శలు గుప్పించారు.
టీఆర్ఎస్ మంత్రుల విమర్శలు..
తెలంగాణ (Telangana)లో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ (BJP) పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలు కావటం లేదని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. దమ్ముంటే అమిత్ షాను ఒప్పించి ఈ పథకాలను ఆ రాష్ట్రాల్లో అమలు చేయించాలని బండి సంజయ్‌కు (Bandi sanjay) సవాల్ విసిరారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల మధ్య విద్వేషాలు, వైషమ్యాలను పెంచి పోషించడం, వారిని రెచ్చగొట్టడం తప్ప బీజేపీ నాయకులు చేసేదేమీ ఉండదని మండిపడ్డారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఏమిస్తారో చెప్పకుండా అక్బర్, బాబర్, నిజాం అంటూ పిచ్చికూతలు కూశారని ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తంచేశారు. అమిత్‌షా ప్రసంగం ప్రజలను రెచ్చగొట్టేందుకే పరిమితమైందని విమర్శించారు.
కేటీఆర్ ప్రశ్నలకు బదులేది?
అమిత్‌షా ఏ మొఖం పెట్టుకొని తెలంగాణకు వచ్చారని మంత్రి గంగుల కమలాకర్ (Kamalakar) ప్రశ్నించారు. రైతుల ధాన్యాన్ని కొనలేని కేంద్ర పెద్దలు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారని నిలదీశారు. మంత్రి కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు (KTR questions) సమాధానం చెప్పలేక కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah) తోక ముడిచారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ (Balka suman) ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఏమిస్తారో చెప్పకుండా అక్బర్, బాబర్, నిజాం అంటూ పిచ్చికూతలు కూశారని ట్విట్టర్‌లో మండిపడ్డారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ (Ajay kumar) మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో వికట పరిహాసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో భ్రమలు కల్పించడానికే అమిత్‌షా, నడ్డా ఇక్కడికి వస్తున్నారని అన్నారు.
పనికిమాలిన ముచ్చట్లు, పచ్చి అబద్ధాలు..
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మాట్లాడుతూ.. తెలంగాణకు కేంద్రం చేసిందేమిటన్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అమిత్‌షా పనికిమాలిన ముచ్చట్లు, పచ్చి అబద్ధాలు చెప్పారని విమర్శించారు. పిచ్చి ఒర్రుడు కాదు- కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ట్విట్టర్‌లో డిమాండ్ చేశారు. నిజాం, రజాకార్ అనే పదాలు తప్ప బీజేపీ నేతలకు ఏమీ రావని టీఎస్‌ఈఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి ఎద్దేవాచేశారు.
తుక్కుగూడ వేదికపై ఉన్న నేతల్లో తొంభై శాతం మంది ఔట్ డేటెడ్ అని, ప్రజల చేత పలుమార్లు తిరస్కరణకు గురయ్యారని రావుల చెప్పారు. 30 వేల మంది కూడా పట్టని సభా ప్రాంగణాన్ని నింపలేక అమిత్‌షా రాకను ఆలస్యం చేశారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలు చేయడం తప్ప దేశానికి చేసిందేమీ లేదని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.