TS POLITICS TRS LEADERS ATTENDING THE NOMINATION CEREMONY OF YASHWANT SINHA THE PRESIDENTIAL CANDIDATE OF THE OPPOSITION PARTIES SNR
Telangana : విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ ..హాజరవుతున్న టీఆర్ఎస్
(Photo Credit:Twitter)
Presidential election : విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ వేయనున్నారు. ఈకార్యక్రమంలో తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు, ఎంపీలు సైతం హాజరుకానున్నారు. ఎన్డీఏ అభ్యర్ధిని కాదని యశ్వంత్‌సిన్హాకు మద్దతిస్తున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ వేయనున్నారు. సోమవారం ఉదయం 11.30గంటలకు నామినేషన్ వేస్తారు. ఈకార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ హాజరవుతోంది. గులాబీ పార్టీ తరపు నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(ktr)తో పాటు లోక్‌సభలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు(Nama Nageswara Rao), ఎంపీలు రంజిత్‌రెడ్డి(Ranjith Reddy), సురేష్‌రెడ్డి(Suresh Reddy), బీబీ పాటిల్(Bb Patil), వెంకటేష్ నేత(Venkatesh Neta), ప్రభాకర్‌రెడ్డి(Prabhakar Reddy) కార్యక్రమంలో పాల్గొంటారు. యశ్వంత్ సిన్హా నామినేషన్ సందర్భంగా కేటీఆర్ ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు. విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమం ఉదయం జరగనుంది.
విపక్ష పార్టీల అభ్యర్ధిగా సిన్హా..
ఇప్పటికే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ముని ఎంపిక చేసింది బీజేపీ. ఆమె నామినేషన్ కూడా వేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్దిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేసినప్పటి టీఆర్ఎస్ తమ అభిప్రాయాన్ని ఎక్కడా చెప్పలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎవరికి ఓటు వేస్తాం...ఎవరికి మద్దతిస్తామనే విషయాన్ని స్పష్టం చేయలేదు. కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే పనిలో ఉన్న టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అంతే ధీటుగా జాతీయ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే జాతీయ పార్టీ పేరు ప్రకటించడం...ఢిల్లీలో టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం నిర్మాణ పనుల్ని వేగవంతం చేయడం జరుగుతోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
బీజేపీతో టీఆర్ఎస్ తాడో -పేడో..
రాష్ట్రానికి నిధుల కేటాయింపులు, కేంద్ర సహకారం విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ పాలకులపై గుర్రుగా ఉంది. తెలంగాణకు అన్నీ విషయాల్లో కేంద్రం మొండి చేయి చూపిస్తోందని ఆరోపిస్తోంది. అభివృద్ధి విషయంలో కూడా బీజేపీ పాలకులు సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ అగ్రనాయకుల్ని కడిగిపారేస్తున్నారు. తెలంగాణలో బలపడి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తుంటే...కేంద్రంలో బీజేపీకి , మోదీకి ప్రత్యామ్నాయశక్తిని తయారు చేయాలని బీజేపీ యేతర రాష్ట్రాల నేతల్ని సమన్వయ పరుచుకుంటూ ముందుకుపోతోంది టీఆర్ఎస్.
రాజకీయల విషయాన్ని పక్కనపెడితే రాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీకి స్పష్టమైన సంఖ్యాబలం ఉంది. దాంతో టీఆర్ఎస్ లాంటి పార్టీ సహకారం కోరాలని బీజేపీ భావించడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.