హోమ్ /వార్తలు /తెలంగాణ /

Khammam: అయోమయంలో టీఆర్​ఎస్​.. పాదయాత్ర దిశగా పొంగులేటి.. ఈ ప్రస్థానం ఎందాక..? 

Khammam: అయోమయంలో టీఆర్​ఎస్​.. పాదయాత్ర దిశగా పొంగులేటి.. ఈ ప్రస్థానం ఎందాక..? 

టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఫైల్ ఫోటో)

టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఫైల్ ఫోటో)

పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas reddy). ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిచయం అక్కర్లేని పేరు. రాష్ట్ర విభజన అనంతర రాజకీయ వాతావరణంలో సైతం.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ (YSRCP) నుంచి ఖమ్మం ఎంపీ (Khammam MP)గా గెలుపొందారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Khammam, India

  (G. Srinivas reddy, News18, Khammam)

  పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas reddy). ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిచయం అక్కర్లేని పేరు. రాష్ట్ర విభజన అనంతర రాజకీయ వాతావరణంలో సైతం.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ (YSRCP) నుంచి ఖమ్మం ఎంపీ (Khammam MP)గా తాను గెలుపొందడమే కాకుండా.. తన పార్టీ నుంచి ముగ్గురిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకుని చరిత్ర సృష్టించిన నేత. అనంతర కాలంలో తెరాసలో (TRS) చేరినా.. గత పార్లమెంటు ఎన్నికల్లో టికెట్‌ దక్కకపోయినా.. ప్రొటోకాల్‌ పరంగా అప్పుడప్పుడూ తోటి నేతల నుంచి అవమానాలు ఎదురవుతున్నా.. తెరాస పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌తో (KTR) ఉన్న సాన్నిహిత్యం వల్ల చిరునవ్వుతో అన్నిటినీ అధిగమిస్తూ.. నిత్యం ప్రజల్లో ఉండడానికి ప్రయత్నిస్తున్న నేతగా సుపరిచితుడు. రాజీకీయాల్లోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ఎంపీగా గెలుపొంది.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి పల్లెలోనూ తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న పొంగులేటి.. పది అసెంబ్లీ నియోజకవర్గాలలో నేతల గెలుపోటములను ప్రభావితం చేయగలిగిన స్థాయిలో ఎస్టాబ్లిష్‌ అయ్యారన్నది పీకే, సునీల్‌ బృందాల సర్వే రిపోర్ట్ సారాంశం.

  బహుశా ఇందుకేనేమో ఎవరెన్ని ఫిర్యాదు చేసినా తెరాస అధినేత కేసీఆర్‌ (KCR) మాత్రం పొంగులేటి విషయంలో ఆచితూచి అన్న ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. వారంలో మూడు రోజులు ప్రజల్లో కలియ తిరగడం వల్ల, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం వల్ల ‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 'శ్రీనన్న'గా ఇమేజ్‌ స్థిరపడిపోయింది.

  పార్టీ నిర్లక్ష్యం చేస్తోందా.. 

  వ్యక్తిగత ఇమేజ్‌, ప్రజాభిమానం దండిగా కూడగట్టుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తెరాస అధినేత నిర్లక్ష్యం చేస్తున్నారా అన్న సందేహం అప్పుడప్పుడూ రాకమానదు. అయితే తమ నేతకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వట్లేదన్న అసంతృప్తి ఆయన వర్గంలోనూ, అభిమానుల్లోనూ ఉందన్నది నిజం. తమ తమ నియోజకవర్గాల్లో పొంగులేటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే పర్యటనలు చేస్తున్నారని పలుమార్లు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినప్పటికీ, ఆ స్థాయిలో ప్రజా సంబంధాలు ఉన్న నేతకు ఏమీ చెప్పలేక, ఔననలేక, కాదనలేక అధినేత కాలం వెళ్లదీస్తున్నట్టు రాజకీయ వర్గాల చెవులు కొరుక్కుంటున్నాయి.

  Electricity purchase: విద్యుత్​ కొనుగోలుపై తెలంగాణకు కేంద్రం గుడ్​న్యూస్​.. వివరాలివే..

  ఎంపీ టికెట్‌ విషయంలో పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి కిమ్మనకుండా ఉన్న పొంగులేటి, తర్వాత కాలంలో రాజ్యసభ టికెట్‌ ఇస్తారని ఆశించారు. అయితే పొంగులేటికి చెక్‌ పెట్టడానికి అన్నట్టు తెరాస అధినాయకత్వం అదే సామాజికవర్గం నుంచి, దాదాపు అదే ప్రాంతం నుంచి హెట్రో డ్రగ్స్‌ బండి పార్ధసారధిరెడ్డిని రాజ్యసభకు పంపింది. ఇక ఆనాటి నుంచి పొంగులేటిపై అభిమానులు, అనుచరవర్గం నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ఇంతగా నిర్లక్ష్యం చేస్తున్నా ఇంకా ఇక్కడే ఉండి అవమానాలు భరించాలా అన్న ప్రశ్న పదేపదే వారి నుంచి పొంగులేటికి ఎదురవుతోంది. ఇలా ఎన్నిమార్లు ఎన్ని ప్రశ్నలు, ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా.. అన్నిటికీ చిరునవ్వే సమాధానంగా పొంగులేటి ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.

  కాంగ్రెస్‌, భాజపాల వల..

  ఉమ్మడి జిల్లాలో బలమైన నేతగా ఎదిగిన పొంగులేటిని తమ పార్టీలోకి లాక్కోవాలని గత కొన్నేళ్లుగా అటు కాంగ్రెస్‌ (Congress) పార్టీ, ఇటు భాజపా (BJP) తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయని చెప్పొచ్చు. ఆయనతో సన్నిహితంగా మెలిగే నేతల ద్వారా పలుమార్లు సంప్రదించినా ఆ రెండు పార్టీలకు ఇప్పటికీ అదే చిరునవ్వే సమాధానం ఎదురైంది. తమకు ఉన్న ఓటు బ్యాంకుకు పొంగులేటి తోడైతే ఇక్కడ పదికి పది సీట్లు కొట్టొచ్చన్నది కాంగ్రెస్‌ వ్యూహం కాగా.. బలమైన నేతకు ఇక్కడ బాధ్యతలు అప్పగించడం ద్వారా క్షేత్రస్థాయిలో పాదుకోవచ్చన్నది భాజపా వ్యూహంగా ఉంది. అయితే తెరాస అధినేత మాత్రం పొంగులేటి విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.

  మరోవైపు వివాహ సంబంధాల ద్వారా పొంగులేటి తన రాజకీయ విస్త్రుతిని చాటుకుంటున్నట్టు కనిపిస్తోంది. తన కుమారుడు హర్షరెడ్డికి ఐవీఆర్సీఎల్‌ కుటుంబం నుంచి సునీల్‌రెడ్డి కుమార్తెను కోడలిగా చేసుకోగా.. తాజాగా కుమార్తె సప్నిరెడ్డికి మాత్రం తెలంగాణలో పేరున్న రాజకీయ కుటుంబమైన మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి మనుమడు అర్జున్‌రెడ్డితో ఘనంగా వివాహం జరిపించారు. ఈ సందర్భంలో ఖమ్మం ఔట్‌స్కర్ట్స్‌లో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు దాదాపు మూడు లక్షల మందికి పైగా హాజరైనట్టు ఎస్బీ వర్గాల ద్వారా తేల్చిన అంచనా. ఇలా ఇప్పుడు పొంగులేటి తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకున్నట్టు అంచనా వేస్తున్నారు.

  పాదయాత్రకు ప్లానింగ్‌..

  ఇదే ఊపుతో ఉమ్మడి జిల్లాలో మరింత పట్టు పెంచుకోవడం.. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునే దానికి గానూ పొంగులేటి పాదయాత్రకు శ్రీకారం చుట్టునున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే రూట్‌మ్యాప్‌కు సంబంధించి బ్లూప్రింట్‌ రెడీ అయినట్టు చెబుతున్నారు. పది నియోజకవర్గాలను కవర్‌ చేస్తూ.. దాదాపు అన్ని మండల కేంద్రాల్లో పాదయాత్ర ఉండేలా.. అలాగే బహిరంగ సభ కూడా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. దీంతో ఆయన పాదయాత్ర ప్రస్థానం ఎటు వైపు దారితీస్తుందన్న దానిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Khammam, Ponguleti srinivas reddy, Trs

  ఉత్తమ కథలు